6 September, 2026 | 8:31 AM

కామ్రేడ్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టకండి

06-09-2026 | 05:30am

సెన్సార్ బోర్డుకు ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి 

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. జనకీరామ్ మారెళ్ల దర్శకత్వం (Directed by Janakiram Marella) వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ తాజాగా ఏర్పాటుచేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్యఅతిథి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. “ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేవారిని కామ్రేడ్స్ అంటారు. సెన్సార్ వాళ్లు కామ్రేడ్ అనే పదంపై అభ్యంతరం తెలిపారని విన్నాను.

సినిమా వర్తమాన పరిస్థితులను కళ్లకు కట్టే అద్దం లాంటిది. అలాంటి సినిమా తల్లిని సెన్సార్ ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. ఓటీటీటీలు, ఇతర మాధ్యమాల్లో వస్తున్న అభ్యంతర కంటెంట్‌ను మీరు ఆపలేకపోతున్నారు. కోట్లాది రూపాయల కష్టార్జితంతో సినిమాలు తీసేవాళ్లను మానసిక హింసకు గురిచేస్తున్నారు. సినిమా అనేది చాలా మంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ. దయచేసి ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టకండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగ హకు. దాన్ని మీరు అడ్డుకోవద్దు.

ఇది నా విజ్ఞప్తి. ఈ టీజర్ చూస్తే నాకు చాలా మంచి వినోదం, ప్రేమ కనిపిస్తున్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “కామ్రేడ్ అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవాళ్ల శుభం కోరుకునే స్నేహితుడు. సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది. మనం మంచి సినిమా చేసినప్పుడు, అందులో విలువ ఉన్నప్పుడు ప్రేక్షకులు విజయాన్ని ఇస్తారు” అన్నారు. ‘నా తొలి సినిమాకి శ్రీవిష్ణు లాంటి హీరో దొరకడం నా అదృష్టం’ అని చిత్ర దర్శకుడు జానకిరామ్ చెప్పారు.

నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. “శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా తీశాం” అన్నారు. నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ.. “ఇది నా తొలి సినిమా. ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో తీశాం. ప్రొడక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా” అని తెలిపారు.  విజయేంద్ర ప్రసాద్,  బాబీ, శివ నిర్వాణ, నందిని రెడ్డి,  బీవీఎస్ రవి, వీఎన్ ఆదిత్య కూడా మాట్లాడారు.  


మరిన్ని వార్తలు