చాక్లెట్ బాక్సుల్లో 25 కోట్ల కొకైన్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టివేత
శంషాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport)లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు భగ్నం చేశారు. ఖతార్ రాజధాని దోహా నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడు చాక్లెట్లలో తెచ్చిన రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్‌ఐ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు విమానాశ్రయంలో నిఘా ఏర్పాటు చేశారు. దోహా నుంచి విమానంలో వచ్చిన అనుమానిత ప్రయాణికుడిని అడ్డుకుని తనిఖీలు చేపట్టగా, అతడి వద్ద ఉన్న క్యాబిన్ బ్యాగేజీలో స్మగ్లింగ్ ముఠా ఎంచుకున్న పద్ధతి చూసి అధికారులు సైతం విస్తుపోయారు. బ్యాగు లో లిండ్ట్ లిండోర్ అసార్టెడ్ ఫిల్ డార్క్ చాక్లెట్ సెలెక్షన్ సెలక్షన్ (లోపల మెత్తని ఫిల్లింగ్ ఉన్న డార్క్ చాక్లెట్ల కలెక్షన్) రకానికి చెందిన 7 లగ్జరీ చాక్లెట్ ట్యూబ్లు లభించాయి.
ఒక్కో ట్యూబ్‌పై 387 గ్రాముల బరువు అని రాసి ఉన్నప్పటికీ, ప్యాకెట్ల బరువు అసాధారణంగా ఉండటంతో అధికారులకు తీవ్ర అనుమానం వచ్చింది. ట్యూబ్లను తెరిచి చూడగా, చాక్లెట్ల మధ్య అత్యంత తెలివిగా దాచిన 207 అండాకారపు క్యాప్సూల్స్ బయటపడ్డాయి. ఆ క్యాప్సూల్స్ లోపల లేత పసుపు, తెల్లటి పొడి రూపంలో డ్రగ్స్ దాచి ఉంచారు. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా జరిపిన పరీక్షల్లో ఆ పొడి అత్యంత తీవ్రమైన కొకైన్ అని తేలింది. నిందితుడి వద్ద ఉన్న 4.9 కిలోల కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.24.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కొకైన్‌కు హైదరాబాద్‌లోని స్థానిక పెడ్లర్లకు సరఫరా చేయడానికి తెచ్చారా? లేక హైదరాబాద్‌ను ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకుని వేరే ప్రాంతాలకు తరలించే ప్లాన్ చేశారా? అనే కోణంలో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కాల్ డేటా, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్‌తో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.