శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ముగ్గురు పెడ్లర్లు అరెస్ట్
శంషాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): శంషాబాద్(Shamshabad) పోలీస్ స్టేషన్(ఆర్జీఐఏ) పరిధిలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక మూఠాను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. నిందితుల నుంచి 80 గ్రాముల మెథాంఫెటమైన్ (మెథ్), 4 ఎల్‌ఎస్డీ బ్లాట్లతో పాటు 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్ రోడ్డులో ఉన్న హెచ్‌ఎండీఏ(HMDA) నర్సరీ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ (అలియాస్ లంబా), మహమ్మద్ ఇమ్రాన్ (అలియాస్ సుకూర్), రహ్మనుద్దీన్ (అలియాస్ లాలా)లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద భారీగా మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి.
బెంగళూరుకు చెందిన మరో ఇద్దరు నిందితులు జంషెడ్, సయ్యద్ జోహార్ మెహది ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన లంబా పాత నేరస్తుడని, అతడిపై ఇప్పటికే 270కి పైగా చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇతనికి బెంగళూరుకు చెందిన ప్రధాన పెడ్లర్ జంషెడ్‌తో పరిచయం ఏర్పడింది. జంషెడ్ నుంచి క్రమం తప్పకుండా మెథ్ తెప్పించుకుని, మహమ్మద్ ఇమ్రాన్, రహ్మనుద్దీన్‌ల సహాయంతో స్థానికంగా ఇతర సబ్ పెడ్లర్లకు అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఇమ్రాన్‌పై కూడా గతంలోనే 3 ఎన్డీపీఎస్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.