ఇషాన్ మళ్లీ మెరిసెన్
ఈస్ట్ జోన్‌కు భారీ ఆధిక్యం
సెంచరీ చేజారిన తిలక్ వర్మ
336 రన్స్‌కు సౌత్‌జోన్ ఆలౌట్
ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ 212/5
దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో ఈస్ట్ జోన్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఆ జట్టు తర్వాత భారీ ఆధిక్యాన్ని అందుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ మళ్ళీ మెరిశాడు. హఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ప్రస్తుతం 584 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఈస్ట్ జోన్ ట్రోఫీ అందుకోవడం లాంఛనమే.
చెన్నై, సెప్టెంబర్ 9: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242/6 ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న సౌత్ జోన్, నాలుగో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరి సెంచరీ మిస్ చేసుకున్నాడు. దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. చామ మిలింద్(43) పర్వాలే దనిపించాడు.
ఈస్ట్ జోన్(East Zone) బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, ఖరైషి, శిఖర్ మోహన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీనితో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన సౌత్ జోన్‌ను స్టార్ ఆటగాళ్లు నట్టేట ముంచేసారు. నేరుగా ఫైనల్ మాత్రమే ఆడుతున్న మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ తీవ్రంగా నిరాశపర్చారు. సిరాజ్ చెత్త బౌలింగ్‌తో ఓటమికి ప్రధాన కారణమయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 5.60 ఎకానమీతో 140 పరుగులిచ్చుకున్నాడు. అతని వైఫల్యంతో ఈస్ట్ జోన్ భారీ స్కోర్ నమోదు చేసి సౌత్ జోన్ పతనాన్ని శాసించింది. ఇదిలా ఉంటే భారీ ఆధిక్యం లభించినప్పటికీ ఈస్ట్ జోన్ ఫాలో-ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ సూర్యవంశీ(8), అభిమన్యు ఈశ్వరన్(3) నిరాశపర్చారు. ఇషాన్ కిషన్(98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌తో 80) దూకుడుగా ఆడగా.. శిఖర్ మోహన్(85 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈస్ట్ జోన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. క్రీజులో కుమార కుశాగ్ర(34 బ్యాటింగ్), మహమ్మద్ ఖురైషి( సిక్స్‌తో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
సౌత్ జోన్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, త్రిపురణ విజయ్, నిదీష్, షేక్ రషీద్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ 584 పరుగుల ఆధిక్యంలో ఉంది. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు కాగా.. ఈస్ట్ జోన్ డిక్లేర్ చేసి సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. ఆఖరి రోజు ఆటలో ఎంత దూకుడగా ఆడినా.. 584 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టం. సౌత్‌జోన్ ఆలౌట్ కాకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. అప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ను విజేతగా ప్రకటిస్తారు.