మాట తెచ్చిన తంటా!
- రాజకీయాల గీతదాటిన ‘నోటి దురుసు’
- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలు
- అధికార, ప్రతిపక్ష నేతలు విస్మయం
రంగారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ‘నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది’ అని పెద్దలు చెపుతుంటారు. ఆ నోరే చెడ్డదైతే.. ఊరంతా చెడ్డది అవుతుంది. ఈ సామెత అచ్చంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Veerlapalli Shankar)కు సరిపోతుంది. శాసనసభ సమావేశాల(Legislative Assembly sessions) వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి విమర్శల వేడి హద్దులు దాటి తీవ్ర దుమారం చెలరేగింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో(Telangana Movement Era) చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకుని, అనంతరం కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరి షాద్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వీర్లపల్లి శంకర్ చుట్టూ ఇప్పుడు వివాదాల సుడిగుండం అల్లుకుంది. అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) సందర్భంగా కేసీఆర్(KCR) నివాసం(ఎర్రవల్లి) ముట్టడి ప్రకటనల వేళ కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ‘చావు డప్పుకొడతాం’, ‘ఆయన చావును కోరుకుంటున్నాం’ అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
కేసీఆర్, కేటీఆర్‌పై ఎమ్మెల్యే వాడిన పదజాలం రాజకీయాల్లో ఉండాల్సిన కనీస నైతికతను దాటిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షాద్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు అందించారు.
గత వివాదాలు పునరావృతం
వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వల్ల ఆలిండియా వెలమ అసోసియేషన్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొని చివరికి పీసీసీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలనే ఉత్సాహంలో శంకర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మైలేజ్ ఇవ్వకపోగా తీవ్రనష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని స్వపక్షంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టీపీసీసీ అధిష్టానం కూడా ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసింది. ఒక బీసీ నేతగా, పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌గా ప్రజాదరణ పొంది శాసనసభకు ఎన్నికైన వ్యక్తి, సభల వద్ద ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన రాజకీయ ప్రతిష్టకే ముప్పుగా మారింది. అధికారం ఉందనే ఆవేశంలో గీత దాటి మాట్లాడితే సొంత నేతలే దూరమవుతారని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.
ఒకరి చావు కోరడం సమర్థనీయం కాదు: ఎమ్మెల్యే శంకర్
మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఒకరి చావు కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను, మహిళా మంత్రులను బీఆర్‌ఎస్ నేతలు అసభ్యకరంగా కులాల పేరుతో దూషిస్తూ, వ్యక్తిగతంగా బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కడుపు మండి కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి రావాలని, సమస్యలపై చర్చించాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని.. కేసీఆ ర్ కుటుంబ ఒక్కరిదే కాదని అన్నారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎంపై, వారి కుటుంబ సభ్యులపైనా బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా. వారి ముందు ఇలా మాట్లాడుతారా. టీవీలలో మీ బూతులు వినలేక మహిళలు చెవులు మూసుకుంటున్నారు.
మీ కుటుంబ సభ్యులు కూడా ఆ మాటలు వినలేక తలదించుకుంటున్నారు’ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌గాంధీపై ‘ఎక్కడ సచ్చిండు రాహుల్‌గాంధీ’ అని మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో కేటీఆర్ మాట్లాడిన వీడియోలను మీడియాకు ఎమ్మెల్యే విడుదల చేశారు.