నేతలు మారినా.. మారని తల రాతలు
- ఆదివాసీ గ్రామాలకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు
అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుడిని మంచంపై మోసుకొచ్చిన కుటుంబ సభ్యులు
రెండు కిలోమీటర్ల్ల వరకు కాలినడకనే ప్రయాణం
పినపాక, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి) : మారుమూల ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం (Road connectivity) లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పినపాక మండలంలోని సుందరయ్య నగర్ ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది.గ్రామానికి చెందిన కోరం మంగయ్య అనే గిరిజనుడికి సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అనారోగ్య సమస్య తలెత్తింది.
దీంతో రహదారి మొత్తం బురదమయంగా ఉండటం తో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచంపై కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం లేకపోవడంతో అతడిని మోసుకుంటూ జానంపేట గ్రామం వరకు తీసుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. అక్కడికి చేరుకున్న అనంతరం 108 అంబులెన్స్ రావడంతో మంగయ్యను వైద్య చికిత్స కోసం మణుగూరు తరలించినట్లు చెప్పారు.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సకాలంలో వైద్యం అందించేందుకు అంబులెన్స్ గ్రామం వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొనడం పట్ల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వాహనాలు గ్రామంలోకి రాలేకపోవడంతో రోగులను మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకురావాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కోరం మంగయ్య తల్లి కోరం సమ్మక్క మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
గ్రామానికి సమీపంలో ఆసుపత్రి ఉండటంతో సాధారణంగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రవాణా సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రస్తుతం కోరం మంగయ్యకు ఏ అనారోగ్య సమస్య తలెత్తిందనే విషయం పూర్తిగా తెలియని పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు . అయితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు మాత్రం గ్రామంలో రహదారి సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయని వారు అంటున్నారు.
ఎన్నోసార్లు అధికారులకు వినతులు
సుందరయ్య నగర్‌తో పాటు మారుమూల ఆదివాసీ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు గతంలో ఎన్నోసార్లు అధికారులను కోరినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనలు కూడా చేపట్టినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి లేకపోవడం వల్ల కేవలం అనారోగ్య సమయంలోనే కాకుండా నిత్య జీవితంలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు గ్రామానికి చేరుకోవడం కష్టంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
అత్యవసర సమయంలో ప్రాణాలపై ఆందోళన
అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకమని, అలాంటి సమయంలో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోతే రోగులను మంచాలపై మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోరం మంగయ్యను కూడా ఇదే విధంగా జానంపేట వరకు మోసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. గ్రామానికి 108 అంబులెన్స్ సైతం నేరుగా చేరుకోలేని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.
అంబులెన్స్ వచ్చే ప్రాంతం వరకు రోగిని మోసుకెళ్లాల్సి రావడంతో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలను ముందుగానే డాక్టర్ వేణు ఆధ్వర్యంలో హాస్పటల్ కు తరలిస్తూ ఉన్నారు.
మారని గిరిజనుల బతుకులు
ఏళ్లుగా రహదారి కోసం పోరాడుతున్నప్పటికీ తమ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని సుందరయ్య నగర్ గిరిజనులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించి రహదారి సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు విద్య, వైద్యం, అత్యవసర సేవలు అందుబాటులోకి రావాలంటే ముందుగా రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామానికి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, అత్యవసర సమయంలో 108 వంటి సేవలు నేరుగా గ్రామానికి చేరుకునేలా మార్గం ఏర్పాటు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుందరయ్య నగర్లో జరిగిన ఈ ఘటనపై అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.
- గిరిజనుల ప్రాణాలు రాష్ట్రంలో ఎన్నో పోతున్నాయి
- ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్
సరైన రహదారి లేని గ్రామాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని కనీస సౌకర్యాలు గిరిజనులు దూరంగా ఉన్నారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ మండిపడ్డారు. గిరిజనుల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచలం ఐటిడిఏ పక్కనే ఉన్న గిరిజనుల బతుకులు మారడం లేదన్నారు. ఇసుక ర్యాంపులకు మాత్రం రహదారికి కంకర వస్తుంది కానీ గిరిజన గ్రామాలకు రాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వాలకు గిరిజనులపై లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న రహదారి సౌకర్యం లేకపోవడంతో పాముకాటు తేలుకాటు వంటివి జరిగితే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందన్నారు.