ఈస్ట్ జోన్ దే దులీప్ ట్రోఫీ

11-09-2026 | 05:40am

13 ఏళ్ల తర్వాత టైటిల్ కైవసం 

సౌత్ జోన్‌తో మ్యాచ్ డ్రా

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇషాన్ కిషన్ 

ఈస్ట్ జోన్‌కు రూ.కోటి ప్రైజ్ మనీ

చెన్నై, సెప్టెంబర్ 10: ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్(East Zone) చరిత్ర సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ(Duleep Trophy) కైవసం చేసుకుంది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. వారి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఈస్ట్ జోన్‌ను చాంపియన్‌గా నిలిపింది. ఆసక్తకర విషయం ఏమిటంటే.. 13 ఏళ్ల క్రితం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ టైటిల్‌ను కూడా ఈస్ట్ జోన్ గెలుచుకుంది. మొత్తంగా ఈస్ట్ జోన్‌కు ఇది మూడో దులీప్ ట్రోఫీ టైటిల్.

రెండో ఇన్నింగ్స్ లో  212/5 ఓవర్ నైట్ స్కోర్‌తో ఈస్ట్ జోన్ జట్టు ఐదో రోజు ఆట ప్రారంభించింది. బ్యాటింగ్ కొనసాగించిన ఆ టీమ్ 99.2 ఓవర్లలో 388/7 పరు గులు చేసింది. అయితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు డ్రాగా ముగించారు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి, 372 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 388/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో, మొత్తం ఆధిక్యం 760 పరుగులకు చేరింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగిసింది.

అనంతరం ఈస్ట్ జోన్ ఆటగాళ్లు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. కెప్టెన్ ఇషాన్ కిషన్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేతుల్లో వికెట్లతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జట్టు మొత్తం స్టేడియం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రేక్షకులకు అభివాదం చేసింది. ఈస్ట్ జోన్ విజయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. రెడ్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇషాన్ కిషన్ క్రమంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ దులీప్ ట్రోఫీ ఫైనల్లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఒక్కడే 270 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 334 బంతులు ఎదుర్కొని 522 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్సలో కూడా కీలకమైన 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఫైనల్లో ఇషాన్ మొత్తం 350 రన్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సౌత్ జోన్ కెప్టెన్ వ్యవహరించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. విజేతగా నిలిచే ఈస్ట్ జోన్  జట్టుకు రూ.కోటి ప్రైజ్ మనీ, రన్నరప్ సౌత్ జోన్‌కు రూ.50 లక్షలు ప్రైజ్ మనీగా లభించాయి.

మరిన్ని వార్తలు