తాతా మధు వ్యాఖ్యలపై భావోద్వేగం
- స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి సీతక్క కంటతడి
- ఎమ్మెల్సీపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం?
- మండలి సభ్యత్వం రద్దుకు అధికార పార్టీ డిమాండ్
- మండలికి తీర్మానం పంపిస్తం: స్పీకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Thatha Madhu) తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar) విచారం వ్యక్తంచేశారు. సభాపతి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సభలో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై శాసనసభ(Legislative Assembly)లో మధ్యాహ్నం చర్చ కొనసాగింది.
సభాపతి అని చూడకుండా అసభ్య పదజాలంతో ధూషించిన మధు మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు సీతక్క(Seethakka), శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాగా, అసెంబ్లీ ముగిసిన అనంతరం స్పీకర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘నాపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు నా సోదరిలాంటి మంత్రి సీతక్క భావోద్వేగంతో కన్నీరు పెట్టడం చూసి గుండె బరువెక్కింది.
ఐదేళ్లుగా సీతక్క క్రమం తప్పకుండా రాఖీ కడుతున్నారు. అలాంటి సోదరి నన్ను అవమానించారంటూ కన్నీరు పెట్టడంతో దు:ఖం ఆగలేదు’. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై త్వరలోనే శాసనసభలో ప్రత్యేకంగా ఓ తీర్మానం చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. ఆ తీర్మానాన్ని తదుపరిచర్యల నిమిత్తం శాసనమండలికి పంపుతామని స్పష్టం చేశారు.
స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించా రు. స్పీకర్ తల్లిని ధూషించడం పట్ల ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందని ఆవేదన చెందారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి, ఉన్నత పదవిలో కూర్చోవడమే ఆ తల్లి చేసిన నేరమా? అని సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల బిడ్డలు అత్యున్నత పదవుల్లో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారంటూ బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు.
ఎమ్మెల్సీ తాతా మధును వెంట నే సస్పెండ్ చేయాలని, సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని కోరారు. మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని సీతక్క ఆరోపించారు. ఈ ఇద్దరిపై అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. ఈ ఘటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నే క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు మొదటి నుంచి దళితు లు, గిరిజనులంటే గిట్టదని, దొర అహంకారం ప్రదర్శిస్తున్నారని సీతక్క మండిపడ్డారు.
మంత్రుల సంఘీభావం..
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ వద్దకు వెళ్లి పరామర్శించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడు తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌ను పట్టుకుని వ్యక్తిగతంగా ధూషించడం సహించరానిదని అన్నారు.
ఇది కేవలం స్పీకర్ వ్యక్తిగత ప్రతిష్టపై దాడి కాదని, సమగ్ర రాజ్యాంగ వ్యవస్థను, దళిత నాయకత్వాన్ని తీవ్రంగా అవమానించడమేనని విమర్శించారు. సభా సంప్రదాయాలను, నియమ నిబంధనలను కించపరిచే విధంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై సభా వేదికగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సభ్య సమాజం తలదించుకునేలా..
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మె ల్సీ తాత మధును సస్పెండ్ చేయాలని టీపీసీ సీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ కోరారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమన్నారు. శాసనసభ స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన లేదా అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ తాత మధు తన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, శాసన మండలి నిబంధనల ప్రకారం తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉన్నప్పటికీ, వ్యక్తిగత అవమానాలు, కుల వివక్షకు తావులేదన్నారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై స్పందించి, ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు దళిత సమాజానికి, స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
