చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి
- డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులను భయపెట్టడం సరికాదు
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
భూపాలపల్లి, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): రోడ్డు విస్తరణలో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Former MLA Gandra Venkata Ramana Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కూరగాయలు, పండ్లు, టీ దుకాణాలు, చికెన్ సెంటర్లు, సెలూన్లపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గతంలో ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నాలుగేళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలను విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఇళ్ల లబ్ధిదారులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల ఇళ్ల పేరుతో మధ్యవర్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై కూడా దృష్టి సారించాలని గండ్ర వెంకట రమణారెడ్డి సూచించారు.