ట్రాక్టర్ జనరేటర్ తో పంటలకు నీరు
ఎండుతున్న పంటలను కాపాడేందుకు రైతుల తిప్పలు
కరెంటు కోతలతో రైతుకు పెరుగుతున్న పెట్టుబడి
గంభీరావుపేట అక్టోబర్ 05 (విజయక్రాంతి): అప్రకటిత కరెంటు కోతలతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తే లో వోల్టేజ్ కరెంటు సమస్యతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలం పొన్నాల పల్లె గ్రామంలో రైతు దేవరాజు ట్రాక్టర్ కు జనరేటర్ అమర్చి వరి పంటకు నీరు అందిస్తున్నాడు. దీంతో రోజు సుమారురూ.5వేల వరకు ఖర్చు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అధికారులు నాణ్యమైన విద్యుత్తు 12 గంటలు అందిస్తున్నామని చెబుతున్న ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. లో వోల్టేజ్ కారణంగా మోటార్లు,కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్కు జనరేటర్ అమర్చడం వలన డీజిల్ ఖర్చు ట్రాక్టర్ అద్దె, వలన అధిక భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. నాణ్యమైన విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.