అందరి సమిష్టి కృషితోనే సింగిల్ విండో అభివృద్ధి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్
పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి సన్మానం
సుల్తానాబాద్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): అందరి సమిష్టి కృషి తోనే సింగిల్ విండో(Single Window) అభివృద్ధి బాటలో ముందుకు దూసుకు పోతుందని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్(Chairman of the Library Authority) అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గౌరవెల్లి మురళీధర్ రావు, పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 33వ మహాజన సభ సమావేశం జరిగింది, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మానవుల జీవనశైలి మారుతున్న తరుణంలో వ్యవసాయ అధికారులు స్పందించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. చిన్న కల్వల సింగిల్ విండో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఈవో వల్ల కొండ రమేష్ ను వారు అభినందించారు, ఈ కార్యక్రమం లో సర్పంచులు ఏరుకొండ స్రవంతి రమేష్, కుమారస్వామి, మేకల పోచాలు యాదవ్, ఉత్తమ కుమారి హాజరై విండో చైర్మన్ గౌరవెల్లి మురళీధర్ రావు, సభ్యులు సాయిలు, శ్యాంసుందర్ రెడ్డి, కుమార్ ,సందీప్, లక్ష్మి, సుధాకర్ రావు, రాజేశ్వరి, ఎల్లయ్య, రాజా గౌడ్, శంకర్, మీనమ్మ, రాజులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో పైడితల్లి, విండో చైర్మన్లు చిలుక సతీష్, రాజేశ్వరరావు, సీఈఓ రమేష్, ఆయా గ్రామాల రైతులు, సంఘ సిబ్బంది , తదితరులున్నారు.