పండుగలు సామరస్యానికి ప్రతీకలు
- ఆధ్యాత్మిక భావన సన్మార్గం చూపుతుంది
- కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం, (విజయక్రాంతి): పండుగలు సమాజంలో సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకలుగా నిలుస్తాయని కొత్తగూడెం శాసనసభ(Kothagudem Legislative Assembly) సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం, రామాటాకీస్ ఏరియా, పాతకొత్తగూడెం, బూడిదగడ్డ తదితర ప్రాంతాలలో వివిధ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తో కలిసి ఆయన సందర్శించారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కులమతాల అంతరాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో పాటు పరోపకార గుణాన్ని, పేదలకు సాయపడే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, మునిగడప వెంకటేశ్వర్లు, బండి నర్సింహా, విసంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.