6 September, 2026 | 8:21 PM

జవ్వాజి ఆశయాల సాధన కోసం పోరాడుతాం:తుడుందెబ్బ

06-09-2026 | 07:40pm

గుండాల, (విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ)(Tudumdebba) మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు అధ్యక్షతన మండల కేంద్రంలో జవ్వాజి లక్ష్మీనారాయణ(Javvaji Lakshminarayana) 8వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ.. జవ్వాజి లక్ష్మీనారాయణ ఆదివాసీ హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు.

జవ్వాజి 1998 సంవత్సరం నుంచి 2018 వరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో వివిధ స్థాయుల్లో, వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ అనేక ఆదివాసీ ఉద్యమాలను నిర్మించారని గుర్తు చేశారు. అనారోగ్య కారణాలతో 2018 సంవత్సరంలో ఆయన అమరులయ్యారని, ఆదివాసీల హక్కులు, చట్టాలు, జల్-జంగల్-జమీన్‌తో పాటు ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కాపాడేందుకు జవ్వాజి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.

ప్రత్యేకంగా 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం (FRA), GO నంబర్ 3 వంటి చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు మరియు ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు ఉద్యోగుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పూనెం బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం శ్రీనివాస్, జవ్వాజి జోషి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు