కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha), అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, ఎం. డేవిడ్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, గ్రంథాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ తదితరులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
శాంతి, అహింస, సత్య మార్గాల్లో ప్రజలను నడిపిస్తూ స్వాతంత్ర్య ఉద్యమాన్ని సంఘటితం చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కిరణ్, జడ్పీసీఓ లక్ష్మీనారాయణ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నదీముద్దీన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.