మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి సేవలు వెలకట్టలేనివి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు
సికింద్రాబాద్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఇరువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీజీకి, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని నడిపించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి కి తన హృదయపూర్వక నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్' ముఖ్యమైనదని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక్ చంద్ర రెడ్డి, మేకల సారంగపాణి,కే నాగేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.