గాంధీ జయంతి.. భట్టి స్పెషల్ మెసేజ్

02-10-2026 | 04:44pm

గాంధీ మార్గమే ప్రపంచానికి దిక్సూచి: భట్టి

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌(Gandhi Bhavan)లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో భట్టి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సత్యం, అహింస, సత్యాగ్రహం, సామాజిక న్యాయం వంటి గాంధీజీ సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని అన్నారు. గాంధీ ఆలోచనలకు భిన్నమైన గాడ్సే భావజాలాన్ని, స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర(History of Independence Movement)ను వక్రీకరించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, వివక్ష రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని భట్టి పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు గాంధీజీ సేవలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు. భవిష్యత్ తరాలకు సత్యం, అహింస, శాంతి, సహనం వంటి విలువలను అందించాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు