గణేశుడు -నేషనలిజం

13-09-2026 | 05:30am
  1. ఉత్సవాల నుంచి జాతీయ చైతన్యం 
  2. భక్తి, సంస్కృతి, ఐక్యతను కలిపే వేడుక 

హిందూ పండుగలు మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు. అంతేకాదు సమాజ అభ్యున్నతికి స్ఫూర్తిదాయకాలు కూడా. ఈ పండుగల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేటి తరం పూర్తిగా గ్రహిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. చాలామంది ఏదో ఆచారం, సంప్రదాయం కాబట్టి జరుపుకుంటున్నామని అంటారు. మరికొందరైతే అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలని పెడార్థాలు తీస్తారు.

ఇక సోషల్ మీడియాలో అయితే హేతువాద సంఘాల వారు, లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ వాదులమని భావించేవారు, విదేశీ భావజాలానికి వంత పాడే స్వయం ప్రకటిత మేధావులు.. ‘మెరుగైన సమాజం’ అంటూ బీరాలు పలికే దిమాగీ నక్సల్స్ ఈ అంశంపై చర్చలు మొదలుపెట్టి వివాదాలు రాజేస్తారు. కానీ ఈ పండుగలు జాతీయ సమైక్యత కోసం, ప్రజలను ఎలా ఏకం చేస్తున్నాయో మాత్రం చెప్పరు.

అవి భారతీయులు పరాయి పాలనలో బానిసత్వంలో మగ్గుతున్న రోజులు. స్వేచ్ఛగా నలుగురు కలిసి తిరగడం, సమావేశం కావడం కూడా అనేక సందర్భాల్లో బ్రిటీష్ పాలకుల అనుమానానికి కారణమయ్యేది. రాజకీయ చైతన్యాన్ని అణిచివేయడానికి ఆంక్షలు విధించారు. ప్రజల్లో భయాన్ని నింపారు. అదే సమయంలో ‘విభజించు విధానంతో భారతీయ సమాజంలోని విభేదాలను మరింత పెంచే ప్రయత్నం చేశారు.

ఈ పరిస్థితులను గమనించిన లోకమాన్య బాలగంగాధర తిలక్ తీవ్రంగా కలత చెందారు. జాతి, మత, వర్గ భేదాలను అధిగమించి భారతీయులందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలనే సంకల్పం ఆయనలో బలపడింది. అందుకు తిలక్ ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

ఇళ్లలో జరిగే వినాయక పూజను సామూహిక ఉత్సవంగా మార్చారు. భారతీయుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలతో పాటు గణేశ్ ఉత్సవాలను కూడా ప్రజలంతా కలిసి నిర్వహించాలని పిలుపునిచ్చారు. భక్తిని సామూహిక శక్తిగా, సామూహిక శక్తిని జాతీయ చైతన్యంగా మలిచారు.

1892లో గణేశ్ ఉత్సవాలకు కొత్త రూపం

1892లో పూణెలోని శనివార్ వాడా ప్రాంతంలో తిలక్ గణేశ్ ఉత్సవాలకు కొత్త రూపాన్ని ఇచ్చారు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహికంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ విషయం తెలిసి పూణె ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కుల, వర్గ భేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై పూజల్లో పాల్గొన్నారు. ఇదే బ్రిటీష్ పాలకులకు అసలు భయాన్ని కలిగించింది. చూసేందుకు అది మతపరమైన కార్యక్రమం. రాజకీయ సభ కాదు.

అందువల్ల దానిపై నేరుగా చర్య తీసుకోవడం పాలకులకు అంత సులభం కాలేదు. కానీ ఆ ధార్మిక వేదికపై ప్రజలు కలుసుకోవడం మొదలైంది. మాట్లాడుకోవడం మొదలైంది. తమ సమస్యలను పంచుకోవడం మొదలైంది. దేశ పరిస్థితులపై చర్చలు సాగాయి. భక్తి పేరుతో మొదలైన సమావేశాలు.. క్రమంగా జాతీయ చైతన్యానికి వేదికలుగా మారాయి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత నీరసించిన స్వాతంత్య్ర స్ఫూర్తికి ఈ సామూహిక ఉత్సవాలు మళ్లీ ఊపిరిపోశాయి.

పూజలు, హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు, ప్రసంగాలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. గణేశ్ ఉత్సవాలు క్రమంగా మహారాష్ట్ర అంతటా విస్తరించాయి. ప్రజల్లో ఉత్సాహం పెరిగిన కొద్దీ ఆంగ్ల పాలకుల్లో గుబులు మొదలైంది. గణపతి పేరు క్రమంగా జాతీయోద్యమంతో ముడిపడింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు ప్రజలను సంఘటితం చేసే వేదికలుగా మారాయి.

కరాచీ, మద్రాసు, కలకత్తా, వారణాసి వంటి పట్టణాల్లోనూ గణపతి ఉత్సవాల ద్వారా సామాజిక, జాతీయ చైతన్యం పెరుగుతున్న విషయాన్ని బ్రిటీష్ పాలకులు గుర్తించారు. మొత్తంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, స్వాతంత్య్ర ఉద్యమంలో వారిని కార్యోన్ముఖులను చేయడంలో తిలక్ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయం.

సమాజాన్ని కలిపే సాంస్కృతిక శక్తి

వినాయక చవితి అంటే కేవలం దేవుడికి పూజ చేయడం కాదు. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఒక ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం. పరస్పరం సహకరించుకునే సందర్భం. పరిచయం లేని వ్యక్తులను కూడా ఆత్మీయులుగా మార్చే వేదిక. వ్యక్తి నుంచి సమిష్టి దాకా ‘అహం’ నుంచి ‘వయం’ వైపు తీసుకువెళ్లే సహజ ప్రయాణం ఈ పండుగ. కుటుంబాల్లో స్నేహాన్ని, అనుబంధాల్లో తియ్యదనాన్ని, సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంచే శక్తి దీనిలో ఉంది. 

పేదల ఇంటి ఆర్థిక పండుగ 

వినాయక చవితికి మరో ముఖ్యమైన కోణం ఉంది. అదే ఆర్థిక వ్యవస్థ. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు అనేక కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మండపాల నిర్మాణానికి వెదురు బొంగులు పెద్దఎత్తున అవసరమవుతాయి. వాటిని అందించే గిరిజన కుటుంబాలకు ఆదాయం లభిస్తుంది.

తడకలు అల్లే గిరిజన మాతృమూర్తులకు ఉపాధి దొరుకుతుంది. మండపాల నిర్మాణం, విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ, బ్యానర్లు, సౌండ్ సిస్టమ్స్, రవాణా.. ఇలా ఎన్నో రంగాల్లో కార్మికులకు పని లభిస్తుంది. అలంకరణ సామగ్రిని తయారు చేసే చిన్నతరహా కళాకారులు, గృహ ఆధారితంగా వస్తువులు తయారు చేసే మహిళలు కూడా ఆదాయం పొందుతారు. మామిడి ఆకులు, పత్రి, పూలు, పండ్లు వంటి పూజా సామగ్రిని అడవుల నుంచి సేకరించి మార్కెట్లకు తీసుకొచ్చే గిరిజన సోదరులు, మాతృమూర్తులకు కూడా ఇది ముఖ్యమైన ఆదాయ వనరు.

ఇక వినాయక విగ్రహాల తయారీనే జీవనాధారంగా చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏడాది మొత్తం ఎదురుచూసే వారికి ఈ సీజన్ అత్యంత కీలకం. విగ్రహాల తయారీ నుంచి రవాణా వరకు ఎన్నో చేతులకు పని దొరుకుతుంది. మండపాల్లో పూజలు నిర్వహించే పూజారులకు సంభావనలు లభిస్తాయి. నైవేద్యాలు, మిఠాయిలు తయారు చేసే వారికి పని పెరుగుతుంది. పూలు, పండ్లు, పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు కళకళలాడుతాయి.

అందుకే వినాయక చవితిని కేవలం పాపంపుణ్యం కోణంలోనే చూడకూడదు. పేద కళాకారుడి చేతిలో పనిముట్టుగా.. చిన్న వ్యాపారి దుకాణంలో ఆదాయంగా.. గిరిజన కుటుంబానికి జీవనాధారంగా.. ఎన్నో కుటుంబాలకు ఈ పండుగ ఆర్థిక ఆశాకిరణంగా నిలుస్తుంది. అందుకే వినాయక చవితి పేదవారి ఇంటి ఆర్థిక పండుగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అన్నదానం సమరసతకు చిరునామా

వినాయక మండపాల వద్ద జరిగే అన్నదానాలు సామాజిక సమరసతకు మరో గొప్ప ఉదాహరణ. పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు తమ శక్తికి తగ్గట్టుగా సహాయం చేస్తారు. వచ్చినవారందరికీ కాదనకుండా కడుపునిండా భోజనం పెడతారు. ఎవరు ఎంత ఇచ్చారన్నది కాదు.. అందరూ కలిసి సేవ చేయడమే ప్రధానంగా ఉంటుంది. ఒకే వరుసలో కూర్చుని భోజనం చేసే ఆ దృశ్యంలో సామాజిక సమానత్వం కనిపిస్తుంది. 

నిమజ్జనం

నిమజ్జనం రోజున ఆ ఉత్సాహమే వేరు. ‘గణేశ్ మహారాజ్ కీ జై’ అంటూ నినదిస్తూనే ‘భారత్ మాతాకీ జై’ అంటూ దేశభక్తిని చాటుతారు. పాటలు పాడుతారు. నృత్యాలు చేస్తారు. బ్యాండ్ మేళాలు మార్మోగుతాయి. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలు సందడి చేస్తాయి. అంతకు ముందు ఒకరినొకరు ఎరుగని వ్యక్తులు సైతం ఆ ఉత్సవ ప్రవాహంలో ఒక్కటవుతారు. భక్తులకు తాగునీరు అందిస్తారు. ప్రసాదాలు పంచుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడ గణపతి భక్తి.. దేశభక్తితో మమేకమవుతుంది. 

సరిహద్దులు దాటిన గణపతి

గణపతి ఆరాధన భారతదేశానికే పరిమితం కాలేదు. ఆసియాలోని అనేక దేశాల సంస్కృతుల్లో గణపతికి ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధ సంప్రదాయాల్లో వివిధ రూపాల్లో ఆయనను ఆరాధిస్తారు. టిబెట్, జపాన్, మయన్మార్, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ గణపతి ఆరాధనకు సంబంధించిన సంప్రదాయాలు కనిపిస్తాయి. జ్ఞానం, బుద్ధి, వివేకానికి ప్రతీకగా గణపతిని భారతీయులు భావిస్తారు. సిద్ధిబుద్ధులకు అధిపతిగా ఆయనను ఆరాధిస్తారు. ఏ శుభకార్యానికైనా ముందుగా గణపతిని స్మరించడం మన సంప్రదాయం. అందుకే గణపతి ఒక దేవతా రూపం మాత్రమే కాదు.. భారతీయ నాగరికతలో జ్ఞానం, శుభం, సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సాంస్కృతిక చిహ్నం.

అర్థం చేసుకోవాలి.. అపార్థం చేయకూడదు

మన దేశంలో కొందరు కుహనా సెక్యులర్ వాదులు, స్వయం ప్రకటిత మేధావులు, హేతువాదులు పండుగలు అంటేనే ధనవంతులు చేసుకునేవని వాదిస్తుంటారు. మరికొందరు వాటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. పండుగల్లో లోపాలు ఉంటే వాటిని చర్చించవచ్చు. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడవచ్చు. అనవసర ఆడంబరాన్ని తగ్గించమని చెప్పవచ్చు. కానీ కొన్ని లోపాలను చూపించి మొత్తం సంప్రదాయాన్నే నిరాకరించడం సమంజసం కాదు.

భారతీయ సమాజ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే మన పండుగల అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు విదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన గణేశ్ ఉత్సవం.. నేడు కూడా సామాజిక సమరసతకు, పేదల ఉపాధికి, సాంస్కృతిక పరిరక్షణకు,

జాతీయ భావనకు బలమైన వేదికగా నిలుస్తోంది. అందుకే మన పండుగలను తక్కువ చేసి చూడటం కాదు.. వాటి అంతర్యాన్ని తెలుసుకోవాలి. సంప్రదాయాన్ని కాపాడుతూనే పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఆడంబరాన్ని తగ్గిస్తూ సామాజిక సేవను పెంచాలి. పేద కళాకారులకు, కార్మికులకు, చిన్న వ్యాపారులకు చేయూతనివ్వాలి.  

ఎందుకంటే వినాయకుడు కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు.. విభేదాలను తొలగించే శక్తికి ప్రతీక. సమాజాన్ని సంఘటితం చేసే చైతన్యానికి ప్రతీక. భారతీయ సమాజాన్ని ‘నేను’ నుంచి ‘మనం’ వైపు నడిపించే జాతీయ సమైక్యతా యజ్ఞం. 

- వనకళ్ల వీరప్ప, జర్నలిస్ట్, 9908621080


మరిన్ని వార్తలు