5 September, 2026 | 7:55 PM

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్ లో ఘనంగా గురు పూజోత్సవం

05-09-2026 | 05:18pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు స్వీయ ప్రేరణతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల విద్యార్థులు మాతృభాష నుంచి ప్రధాన ధారలోకి వచ్చి, మెరుగైన విద్యా ప్రమాణాలు సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషితో పాటు స్వీయ ప్రేరణ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ లలో తొలిసారిగా ఎఫ్ఎల్‌ఎన్ (FLN) అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఉత్తమ బోధనా పద్ధతులను తోటివారితో పంచుకుంటూ, విద్యార్థులలో డ్రాపౌట్లు లేకుండా ఉన్నత చదువులు, కెరీర్ గైడెన్స్ అందించాలని సూచించారు.

అనంతరం ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షిషా, పీవో మంద మకరందు,సబ్ కలెక్టర్ ప్రణయ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించి మొమెంటోలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో డీడీ అశోక్, ఏపీవో భాస్కర్, డిప్యూటీ డిఈఓ చందన్, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, ఉమ్మడి జిల్లా డీటీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు