తెలుగులోకి ఆధ్యాత్మిక సునామీ!
చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించిన ఆధ్యాత్మిక చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న ‘హనుమాన్ అంశ్’(Hanuman Amsh Telugu Release) తెలుగు వెర్షన్ అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.
సెప్టెంబర్‌లో రావాల్సి.. అక్టోబర్‌లో ఎంట్రీ
వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్( Hanuman Amsh Telugu Version) సెప్టెంబర్ 18నే విడుదల కావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదల బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ చేపడుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పంపిణీ వ్యవహారాల్లో అనుకున్న స్థాయిలో ఒప్పందం కుదరకపోవడంతో ఆ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో టీజర్‌ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి దశలో కార్యక్రమం రద్దవడంతో తెలుగు రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరదించుతూ హోంబలే ఫిల్మ్స్ స్వయంగా తెలుగు విడుదల బాధ్యతలను తీసుకుంది.
రూ.1.8 కోట్ల సినిమా.. రూ.400 కోట్ల వసూళ్లు!
సినిమా బడ్జెట్‌తో పోలిస్తే ఈ మూవీ సాధించిన బాక్సాఫీస్ ఫలితాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రూ.1.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు చెబుతున్న ఈ చిత్రం భారతదేశంలోనే రూ.300 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. విడుదలైన 52వ రోజుకే ఈ సినిమా భారత్‌లో రూ.300 కోట్ల నెట్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది.
అసలు కథ ఏంటి?
‘హనుమాన్ అంశ్’ ఓ సాధారణ కమర్షియల్ కథ కాకుండా ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకున్న చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితంలోని అంశాల నుంచి ప్రేరణ పొంది కథను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది. లక్ష్మీ నారాయణ్ అనే వ్యక్తి సాధారణ జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా అడుగులు వేశాడు? ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు అతడిని ప్రముఖ సాధువుగా ఎలా తీర్చిదిద్దాయి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.
ఎవరు తెరకెక్కించారు?
విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నీమ్ కరోలి బాబా(Neem Karoli Baba) పాత్రలో శోభినవ్ సత్యా నటించగా.. విహాన్ షెదెగే, పూర్ణిమ తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే హిందీ సహా ఇతర భాషల్లో ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆదరణ పొందుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా తొలిసారి తెలుగులోకి రావడంతో తెలుగు ఆడియన్స్‌లోనూ ఈ మూవీపై క్యూరియాసిటీ పెరుగుతోంది. అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ విడుదల కానుండటంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ ఆధ్యాత్మిక కథ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.