ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): హర్ ఘర్ జల్–జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత, నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని గోవింద్పూర్ గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యువరాజ్ మర్మట్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోవింద్పూర్ గ్రామంలో వంద శాతం మంచినీటి కనెక్షన్లు సాధించడం అభినందనీయమన్నారు. ఇంటింటికీ అందుబాటులో ఉన్న మంచినీటి కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. పైపులైన్లు, నల్లాల్లో చిన్నపాటి మరమ్మతులు ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో పరిశుభ్రత, నీటి సంరక్షణ, సామాజిక బాధ్యతపై ప్రజలు, చిన్నారులకు అవగాహన కల్పించారు. నీటి వనరులు, ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. నీటి సంరక్షణ, పరిశుభ్రతపై చిన్నారులు తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామంలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.