20 August, 2026 | 2:43 AM

హరీశ్‌రావు హౌస్ అరెస్టు

20-08-2026 01:39 AM

కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తత

టిమ్స్ సందర్శనకు వెళ్తుండగా పోలీసుల కట్టడి

మరికొందరి నేతల అరెస్టు

రంగారెడ్డి, అగస్టు 19 (విజయక్రాంతి): సనత్‌నగర్‌లోని టిమ్స్ సందర్శనకు బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునివ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి తనిఖీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులను పోలీసులు బుధవారం ఉదయం ముందస్తుగా గృహనిర్బంధం హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా నిరోధించేందుకు కోకా పేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

హరీశ్‌రావు కాన్వాయ్ ముందుకు కదలకుండా వాహనానికి అడ్డుగా నిలిచారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. హరీశ్‌రావును పరామర్శించేందుకు వచ్చిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు పలువురు నేతలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో నిర సన జ్వాలలు మిన్నంటాయి. ముందస్తు అరెస్టులు, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు పి. సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, పలువురు రాష్ట్ర నాయకులను పోలీసులు బుధవారం ఉదయాన్నే వారి నివాసాల్లో హౌస్ అరెస్ట్ చేశారు.