కేసీఆర్ పాత్రలో జీవించావ్!
నటుడు ప్రియదర్శికి హరీశ్‌రావు అభినందనలు
ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ‘ప్యారడైజ్’ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని, ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పాత్రలో ప్రియదర్శి(Actor Priyadarshi) జీవించారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) కొనియాడారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు.
ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు. నటుడు ప్రియదర్శి బుధవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శితో హరీశ్‌రావు ఆత్మీయంగా మాట్లాడారు. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో.. మనం తెలంగాణ సాధనలో చూశామని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ యాసకు, మన పల్లె కథలకు ప్రియదర్శి కేరాఫ్ అడ్రస్‌గా మారారని హరీశ్ రావు అన్నారు.
గతంలో వచ్చిన ‘మల్లేశం’ సినిమా ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలను, ’బలగం’ సినిమాతో మన పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను ప్రపంచానికి అద్భుతంగా చాటిచెప్పారని గుర్తుచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. తన స్వయంకృషితో మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడిగా ప్రియదర్శి ఎదగడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆయన భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.