6 September, 2026 | 8:32 AM

హెల్త్ స్కీం ఎక్కిరింత!

06-09-2026 | 05:45am

జీతాల్లో కోత.. సేవల్లో వ్యథ

  1. ఉద్యోగులకు గుదిబండ 
  2. పనిచేయని కార్డులు, పూర్తిస్థాయిలో అమలుకాని ఆరోగ్య పథకం 
  3. నగదు రహిత వైద్య సేవలకు పలు ఆస్పత్రులు విముఖత 
  4. ఉద్యోగుల వేతనాల నుంచి నాలుగు సార్లు పథకం వాటా ధనం కోత

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees), ఉపాధ్యాయులు(Teachers), పెన్షనర్లు(Pensioners) సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. నగదు రహిత(Cashless) సేవలంటూ ప్రారంభించిన పథకం అమలు(scheme implementation)లో లోపాలతో ఆందోళన చెందుతున్నారు. కొండనాలుకకు మందేస్తామని చెప్పి ఉన్న నాలుక ఊడగొట్టే పరిస్థితులు దాపురించాయని ప్రభుత్వ తీరుపై మండిపడుతు న్నారు.

ఆర్భాటంగా ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం)(Employees Health Scheme)ను ప్రారంభించారే తప్ప ఆచరణ శూన్యంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఏవో కొన్ని చిన్నాచితక ప్రైవేట్.. ఒకట్రెండు కార్పొరేట్ ఆసుపత్రులు(Corporate Hospitals) మినహా అన్ని ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందడం లేదని ఆరోపిస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా అప్పటి ఈహెచ్‌ఎస్‌కు ఇప్పుడు ప్రారంభించిన నూతన స్కీంకు పెద్దగా తేడా  లేదని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

20 శాతంలోపు ఆస్పత్రుల్లోనే..

ఎంత ఆర్భాటంగా ప్రారంభించారో అంతే ఆర్భాటంగా ఈహెచ్‌ఎస్ స్కీం విఫలమైందనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. జూలై 17న రాష్ట్ర సచివాలయంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నాలయకులతో ఈహెచ్‌ఎస్ స్కీంను ప్రారంభించి, అక్కడే ఉద్యోగులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. హెల్త్ కార్డులు ఇచ్చారని లబ్ధిదారులు సంబరపడ్డారు.

కానీ క్షేత్రస్థాయిలో వెళ్తే కానీ అవి ఆసుపత్రుల్లో పనిచేయడంలేదని వారికి అర్థమైంది. ఇంకా చాలా మంది లబ్ధిదారులు హెల్త్ కార్డులనే విడుదల చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నాడు 17.88 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు 1816 వైద్య, శస్త్రచికిత్సలకు నగదు రహిత సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌తోపాటు 114 ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్సలు అందుబాటులో ఉంటాయని ప్రకటించిన విధంగా సేవలు మాత్రం అందుబాటులో లేవు. కేవలం ఇప్పటివరకు 15 నుంచి 18 శాతం వరకు మాత్రమే నగదు రహిత చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు ఒప్పుకున్నాయని ఉద్యోగ జేఏసీ నాయకులు చెప్తున్నారు. 

జీతాలు, వైద్య సేవల్లోనూ కోతే..

ఉద్యోగులందరికీ క్యాష్ లెస్ వైద్యం అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ రెండు నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. కార్డు తీసుకుని దవాఖానకు వెళ్తే ‘మీ కార్డు పని చేయడం లేదు, సర్వర్ డౌన్’ అనే మాటే వినిపిస్తోంది. ఇంకో హాస్పిటల్‌కు వెళ్తే ‘హెల్త్ కార్డుపైన మేము వైద్యం అందించం’అనే సమాధానాలు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వస్తున్నాయి.

కానీ ఉద్యోగుల వేతనాల నుంచి మాత్రం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ 1.5 శాతం ఇన్‌స్టాల్‌మెంట్ (ప్రీమియం) కట్ అవుతోంది. ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించేదే వైద్య సేవలకు. డబ్బులు తీసుకుని ఎందుకు వైద్య సేవలు అందించడంలేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం తమకు ‘ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు, మేము ఈహెచ్‌ఎస్ కింద తీసుకోము’ అని తేల్చిచెప్తున్నాయి.

దీంతో ఉద్యోగులు కార్డులు చేతిలో పట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఉద్యోగుల పరిస్థితితే ఇలా ఉంటే 70 ఏళ్లు దాటిన పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని ప్రధాన ఆసుపత్రుల ముందు పెన్షనర్లు క్యూ కడుతున్నారు. కార్డు పని చేయక, వైద్యానికి డబ్బుల్లేక, వయసు మీద పడి వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్యాన్ని వెంటనే అమల్లోకి తేవాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు