ఆటో చార్జీల మోత..
- విద్యార్థులు, సామాన్యుల గగ్గోలు
- ఐదు కిలోమీటర్లకే రూ.30!
- చార్జీలకు అడ్డూ అదుపూ లేదా? పట్టించుకోని అధికారులు?
- లిఫ్ట్ ను ఆశ్రయిస్తున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్...
సింగరేణి సెప్టెంబర్ 30 విజయ క్రాంతి: ఆటో చార్జీల పెంపుపై విద్యార్థులు, సామాన్య ప్రయాణికులు(Ordinary passengers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికే రూ.30 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. రోజువారీగా విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, ఇతర సామాన్య ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తుండటంతో అదనపు చార్జీల భారం పడుతోందని వాపోతున్నారు.
చిన్న దూరాలకు కూడా అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారని, దీంతో ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ఆటో చార్జీలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, నిర్ణయించిన చార్జీల అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఆటో చార్జీల విషయంలో స్పష్టమైన ధరల పట్టికను అందుబాటులో ఉంచడంతో పాటు, అధిక వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కారేపల్లి టు వయా భాగ్యనగర్ తండా రూట్ లో విద్యార్థుల అవస్థలు
కారేపల్లి నుండి భాగ్యనగర్ తండా మీదుగా వెళ్లే విద్యార్థులు ఆటో చార్జీలు భరించలేక ఇబ్బంది పడుతున్నారు.కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ హై స్కూల్, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కు సరైన ప్రయాణ సౌకర్యం లేక ఆటో లకు రూ.30 ప్రతిరోజు రాను పోను 60వేచించాల్సింది వస్తుంది.ఇది పేద విద్యార్థులకు భారంగా మారిందని పలువురు వాపోతున్నారు.దీంతో చాలామంది ఉదయం రోడ్డు మీద నిలబడి వయా భాగ్యనగర్ తండా వెళ్లే బైకులను, లారీలను లిఫ్ట్ అడుక్కుంటున్నారు.
ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థుల డిమాండ్..
కారేపల్లి - భాగ్యనగర్ తండా మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మరియు ఇతర పనులకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారికి ప్రయాణ సౌకర్యం అనుకూలంగా ఉండే విధంగా వయా కారేపల్లి నుండి భాగ్యనగర్ మీదుగా ఇల్లందు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఇదే రూట్ లో ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.