ఆస్తులెన్నో తేలాలి
- కేసీఆర్, రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణకు సిద్ధం
- సీఎంకు దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి
- ధైర్యం ఉంటే అసెంబ్లీని నెలరోజులు పొడిగించాలి
- అటెన్షన్ డైవర్షన్ కుట్రలను ఎండగడతాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS Party leader KCR) పుట్టిన ఏడాది 1954 నుంచి నేటివరకు.. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలన్నారు.
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, కేసీఆర్‌పై రేవంత్ ప్రభుత్వం ఏర్పాటుచేసే సొంత సిట్లు, సెట్లు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ వైపు ఏ తప్పునా బయటపడితే చట్టపరంగా ఎలాం టి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.
గతంలో వెయ్యిసార్లు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ అని వాగిన రేవంత్ రెడ్డి, నిన్న అసెంబ్లీలో 67 ఎకరాలని స్వయంగా అంగీకరించారని, మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే వాటిని ప్రభుత్వానికే రాసిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లలోనే ఈ భూముల వివరాలను వెల్ల డించారని, ఆదాయపు పన్ను, స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూమి అని చెప్పారు. ఇంతకాలం వాటిపై తప్పుడు ప్రచారం చేసి బురదజల్లినందుకు కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ విఫల పాలనపై నిలదీస్తామన్న భయంతోనే ప్రధాన ప్రతిపతిక్షమైన బీఆర్‌ఎస్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. స భలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసి బీ జేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి అసెంబ్లీని ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని మండిపడ్డారు. ‘తన కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం ప్రతిపక్షానికి లేదని నిన్న ప్రగల్భాలు పలికి న రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. ధై ర్యముంటే శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు పొడిగించి, మాపై పెట్టిన అక్ర మ సస్పెన్షన్లను ఎత్తివేయండి.. కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం కాదు, 420 హామీల మోసంపై తెలంగాణ ప్రజల పక్షాన మీ కాలర్ పట్టుకుని నిలదీస్తాం’ అని హెచ్చరించారు.
సీఎం పదవికే కళంకం..
చట్టసభల్లో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దరికంతో మాట్లాడాలే తప్ప అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను, రాష్ట్రాన్ని, శాసనసభను తప్పుదోవ పట్టించడం అత్యంత బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ పవిత్రతను భయంకరంగా దుర్వినియోగం చేస్తూ ఆ వ్యవస్థకు, ముఖ్యమంత్రి పదవికే తీవ్ర కళంకం తెస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో ఆయన వ్యవహార శైలి తలా తోకా లేకుండా సాగిందని, రెండున్నర గంటల పాటు ఏం మాట్లాడారో, ఏం మొత్తుకున్నారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
ఆ అజ్ఞాన ప్రదర్శన సమయంలో సభలో తాము లేకపోవడం ఒక రకంగా తమ అదృష్టమని పేర్కొన్నారు. అనుకోకుండా జాక్‌పాట్‌లో భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తగిలినట్లు పదవులు వస్తే నడుమంత్రపు సిరిలా వ్యవస్థలు ఇలాగే తయారవుతాయని విమర్శించారు. కేసీఆర్‌ను చూసి తాను కూడా నాలుగు పద్యాలు, కొటేషన్లు, పెద్దల పేర్లు చెబితే గొప్ప నాయకుడిని అయిపోతానని శ్రీశ్రీ పేరును ప్రస్తావించారు తప్ప, ఆ మహానుభావుడి పూర్తి పేరు కూడా రేవంత్ రెడ్డికి తెలియదని, తన అపారమైన అజ్ఞానాన్ని, తెలివితక్కువతనాన్ని సీఎం మరోసారి సభాముఖంగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయని, బంగారు బాత్రూమ్‌లు కట్టారని, కొత్త సెక్రటేరియట్ కింద నుంచి సొరంగం తవ్వుకుని లంకెబిందెలు తరలిస్తున్నారని చేసిన చిల్లర ప్రచారంలో ఎంత వాస్తవముందో, ఇప్పుడు శాసనసభలో ఆయన మాట్లాడిన మాటల్లోనూ అంతే నిజముందని కొట్టిపారేశారు. నాడు రూ. 80,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ఊరూరా ప్రచారం చేసి, ఢిల్లీ నుంచి ఆర్టిస్టులను, టూరిస్టులను రప్పించి, నాటకాలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చినట్లే, నేడు కూడా అదే అబద్ధాల వరద పారిస్తున్నారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆరు నెలల గడువు ముగుస్తుందన్న అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని, ప్రజాసమస్యలపై చర్చ జరుగుతుందని ఆశించిన అన్నివర్గాల ప్రజలను ప్రభుత్వం ఘోరంగా వంచించిందని పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మూడేళ్లుగా విశ్రాంత ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, కమీషన్లు ఇస్తే తప్ప రిటైర్మెంట్ ప్రయోజనాలు రావని ఇందిరా పార్క్ ధర్నాలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు స్వయంగా ఆరోపించినా సభలో దానిపై చర్చే జరగలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతాం..
కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం కాక, పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో జన్మించి, 72 ఏళ్ల వయస్సులో నేడు 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఆయన ఆస్తులు పెరిగినట్టా, తరిగినట్టా అని సూటిగా ప్రశ్నించారు. తాను జేఎన్యూ ఎంట్రన్స్ రాసి మాస్టర్స్ చేసి, జీమ్యాట్ రాసి అమెరికాలో ఎంబీఏ చదివి, అక్కడే ఆరున్నర ఏళ్లు ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించానని,
కానీ రేవంత్ రెడ్డి 1983లో ఎస్సెస్సీ, 1985లో ఇంటర్ పూర్తి చేసి 1992లో డిగ్రీ పాస్ కావడానికి ఏడేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. వనపర్తిలో గోడల మీద రాతలు రాసే స్థాయి నుంచి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్‌లు నిర్మించుకునే స్థాయికి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ఆ ట్రిక్కు నిరుద్యోగ యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు.
సీఎం కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా అంతరిక్ష, ఏరోస్పేస్ కంపెనీలు స్థాపించడంపై మండిపడుతూ, నిన్నమొన్నటి దాకా కేఎల్ శ్రీధర్ రెడ్డి (కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్ఫ్రా) కార్లలో తిరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎంకు సాయంత్రం వేళల్లో వసూళ్ల లెక్కలు చూసుకోవడం, గల్లా పెట్టెలు సర్దుకోవడం, ఢిల్లీకి మూటలు పంపే పనుల్లో బిజీగా ఉంటారు కానీ మాకు అలాంటి పనులేమీ లేవని కేటీఆర్ దుయ్యబట్టారు. తన తొత్తులతో ఫామ్‌హౌస్‌పై విచారణలు చేయించి, అనుకూల పత్రికల్లో రాయించుకుని శునకానందం పొందడం తప్ప ఇందులో ఏమీ లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జన్వాడ విషయంలో ఇగో బుల్డోజర్, అగో బుల్డోజర్ అంటూ డైవర్షన్ గేమ్‌లు ఆడుతున్నారు తప్ప మూడేళ్లయినా తేల్చిందేమీ లేదన్నారు. సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తించడం లేదని, రేవంత్ తీవ్రమైన ఐడెంటిటీ క్రైసిస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతున్నారని, మంచి సైకాలజిస్ట్‌తో చికిత్స చేయించాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్ల వద్ద కేసీఆర్ కుటుంబ ఆస్తులంటూ బ్యానర్లు కట్టడంపై స్పందిస్తూ, ఒక చిల్లరగాడు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉన్నప్పుడు బటన్లు నొక్కి మా ఆస్తులేవో బయటపెట్టి, శ్వేతపత్రం వేసి చర్యలు తీసుకోవచ్చు కదా అని నిలదీశారు.
అలాగే కేసీఆర్ రెండు ఎకరాల ఇంట్లో పుట్టినా, హైదరాబాద్‌లో తమ కుటుంబమంతా కలిసి ఉండటానికి సరైన నివాసం లేక కేసీఆర్ ఎక్కడో ఫామ్‌హౌస్‌లో, తాను నార్సింగిలో వేర్వేరుగా ఉంటున్నామని, కానీ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారని నిలదీశారు. మహిళలను గౌరవిస్తామని చెప్పుకునే రేవంత్ రెడ్డి, బంగారు రాఖీలు కట్టించుకుని రెండు రోజుల్లోనే గొంతు కోసే రకమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ 420 మోసాలు, వెయ్యి రోజుల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ చేసే కుట్రలను బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలతోనే కలిసి గట్టిగా తిప్పికొడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సిరిసిల్ల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలకు, కార్మికులకు దశాబ్దాల క్రితం ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా భూములుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల సగం పట్టణం ఒకనాటి రాయిని చెరువు భూముల్లోనే విస్తరించి ఉందని, కమ్యూనిస్టుల కాలంలో సీహెచ్ రాజేశ్వరరావు తదితర నాయకులు చెరువు ఎండిపోతే అందులోనే పేదలకు, కార్మికులకు 60, 70 గజాల చొప్పున ప్లాట్లు చేసి పట్టాలు పంచి ఇచ్చారని గుర్తుచేశారు.
స్వయంపాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో 58, 59 కింద ఆ పేదల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తే, దాన్ని నేడు ముఖ్యమంత్రి కబ్జా అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్తానంటున్నావు కదా, దమ్ముంటే సిరిసిల్లలో 8,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ సర్వే నంబరో, ఏ ఊరో, ఎవరు కబ్జా చేశారో సమగ్ర వివరాలతో ఒక అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
సిరిసిల్ల ప్రాంతంలో రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతూ, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్త అబ్బాడి అనిల్ రెడ్డిని వేధించడమే కాకుండా, ఆయన దొరకలేదని గుండెజబ్బుతో బాధపడుతున్న ఆయన బాబాయ్ అబ్బాడి రాజిరెడ్డిని 14 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టించారని మండిపడ్డారు. అలాగే మాజీ నక్సలైట్, జిల్లా పార్టీ అధ్యక్షుడైన బలహీన వర్గాల బిడ్డ తోట ఆగయ్యకు 1999లో లొంగిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చిన 3.5 ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా లాక్కుందని మండిపడ్డారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం 30 శాతం కమీషన్లు దండుకోవడానికే ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితా అనే దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కోటి ఎకరాల నిషేధిత భూముల్లో 30 లక్షల ఎకరాల ప్రైవేట్ భూములున్నాయని స్వయంగా సీఎం ఒప్పుకున్నారని, తప్పు ప్రభుత్వం చేసి సామాన్య ప్రజలను నిరూపించుకోమనడం వెనుక భారీ వసూళ్ల దందా దాగి ఉందని ఆరోపించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎబ్రెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు ఎన్నికల అఫిడవిట్లలో చట్టబద్ధంగా చూపించిన ఆస్తులపై అసత్య ఆరోపణలు చేస్తూ సీఎం చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.
భూపాలపల్లిలో 106 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోరాడి కాపాడి ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కుగా మారిస్తే దానిపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి దళితులకు భూములు పంచాలనే ఉద్దేశం నిజంగానే ఉంటే దాన్ని చేతల్లో నిరూపించాలని సవాల్ చేశారు.
బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం కోకాపేటలో ఎకరం రూ. 200 కోట్ల విలువ చేసే 75 ఎకరాల భూమిని (సుమారు రూ. 15,000 కోట్ల ఆస్తి) కేసీఆర్ కేటాయించినట్లు రేవంత్ రెడ్డి ఒక్క గజమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ భూమిని బడుగుల ఆత్మగౌరవానికి ఒక సాధనంగా చూస్తే, రేవంత్ రెడ్డి మాత్రం భూమిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపార వస్తువుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు.