కోట్ల ఆస్తులు ఎట్లొచ్చాయ్?

22-09-2026 | 05:25am
  1. కేసీఆర్ సన్నిహితులకే ఎలా సాధ్యం!
  2. గద్దర్, జయశంకర్ ఏం సంపాదించారు
  3. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
  4. రంగారెడ్డి జిల్లా మద్దూరు గ్రామంలో ఫాంహౌస్ పరిశీలన

రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): 2009 ఎన్నికల అఫిడవిట్‌(Election Affidavit)లో కేవలం రూ.12 లక్షల ఆస్తులు మాత్రమే చూపించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(Former Minister Jagadish Reddy)కి, ఇప్పు డు కోట్ల రూపాయల విలువైన భూములు, ఫాంహౌస్‌లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(Congress MPs, MLAs, and MLCs) ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామంలోని సర్వే నంబర్లు 162, 223 పరిధిలో ఉన్న దాదాపు 50 ఎకరాల భూములు, ఫాంహౌస్‌ను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ర్టంలో ఫామ్‌హౌస్ సంస్కృతి పెరిగిందని విమర్శించారు. కేసీఆర్‌ను చూసి హరీశ్‌రావు, కేటీఆర్‌లతో పాటు జగదీ శ్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి వంటి నేతలు భారీగా ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు నిజాం నవాబులు సర్ఫెఖాస్ భూముల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్న తరహాలోనే బిఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ర్టంలో సీఎంలుగా చేసిన టి.అంజయ్య వంటి నాయకులకు ఎన్ని ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్‌కు అప్పగిస్తే, రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ధ్వజమెత్తారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమకారులకు దక్కని ఫలాలు

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న గద్ద ర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం వంటి నాయకులు ఏం సంపాదించుకోలేదని తెలిపారు. సూర్యాపేటలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ కుటుంబం నేటికీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉన్నదని, అమరుడు శ్రీకాంతాచారి తల్లి ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతోందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ వద్ద సోడా, వాటర్ మిక్స్ చేసినవాళ్లకు మాత్రం పదవులు, కోట్ల ఆస్తులు వచ్చాయని ఎద్దేవాచేశారు.

కేసీఆర్ కుటుంబం 9 జిల్లా లు, 24 మండలాలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలో 400 ఎకరాలకు పైగా భూములను ఆధీనంలో ఉంచుకుందని ఆరోపించారు. నిజాం నవాబు 200 ఏళ్లలో కూడబెట్టిన ఆస్తుల కంటే కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలోనే ఎక్కువ సంపాదించిందని విమర్శించారు. జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఏవైనా ఇనాం భూములు ఉంటే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మంద సామెల్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు