జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. 'హైబ్రిడ్' ఉగ్రవాది అరెస్ట్

09-09-2026 | 01:15pm

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ హంద్వారాలో భారీ ఉగ్రకుట్ర(Terror plot) భగ్నమైంది. ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారాలో పనిచేస్తున్న ఒక మాజీ ఉగ్రవాది(Former terrorist) నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen)కు అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాద ముఠాను ఛేదించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు(Jammu and Kashmir Police) తెలిపారు. హంద్వారా-కుప్వారా ప్రాంతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ 'హిజ్బుల్ ముజాహిదీన్' మాడ్యూల్‌లో భాగంగా 'హైబ్రిడ్ ఉగ్రవాది'గా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక మాజీ ఉగ్రవాది గురించి విశ్వసనీయ సమాచారం అందిందని అధికారప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అందిన సమాచారంపై తక్షణమే స్పందించిన హంద్వారా పోలీసులు, 21 RR, 92 బెటాలియన్ CRPF బలగాలతో కలిసి హంద్వారా పట్టణంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టారు.

క్షుణ్ణమైన భద్రతా తనిఖీ అనంతరం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హంద్వారాలోని క్రుహ్మురా ప్రాంతానికి చెందిన మహ్మద్ సుల్తాన్ భట్ కుమారుడు మంజూర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి చైనా మేడ్ పిస్టల్, 2 మ్యాగజైన్లు, 16 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకటన ప్రకారం, అరెస్టు అయిన వ్యక్తి గతంలో రెండు కేసుల్లో పోలీసులకు చిక్కిన మాజీ ఉగ్రవాదిగా గుర్తించారు. హంద్వారా పోలీస్ స్టేషన్‌లో(Handwara Police Station) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నంబర్ 232తో కేసు నమోదు చేయబడిందని, ఆ మాడ్యూల్ పూర్తి స్థాయిని, దాని నెట్‌వర్క్‌ను, ఇతర సంబంధిత కార్యకలాపాలను నిర్ధారించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు