హోటళ్లలో వరుస విషాదాలు..సేఫ్టీ ఎక్కడ?
హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad)లో వేర్వేరు ప్రాంతాల్లో హోటళ్లలో మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 21న మాదాపూర్‌లో షారోన్ నిఖిత, సెప్టెంబర్ 29న ఎస్ఆర్ నగర్లో బి. శిరీష, అక్టోబర్ 2న మియాపూర్‌లో కోమటి సృజన మృతిచెందారు. ఆయా ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు(Investigation) చేస్తున్నారు. మాదాపూర్ ఘటనలో నిఖిత మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా మియాపూర్‌లో సృజన మృతి ఘటనపైనా హత్య కేసు నమోదైంది. ఎస్ఆర్ నగర్లో శిరీష మృతి ఘటన కూడా హత్య కేసుగా నమోదైనట్లు తెలుస్తోంది.
వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోటల్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతోంది? అతిథుల వివరాలను హోటల్ యాజమాన్యాలు పూర్తిస్థాయిలో వెరిఫికేషన్(Verification) చేస్తున్నాయా? సీసీ కెమెరాల నిర్వహణ ఎలా ఉంది? అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారా? భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.