అమీర్ లోగ్‌లో అచ్చం మా అమ్మలాంటి పాత్ర చేశా!
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవిరెడ్డి సోమ నిర్మించిన తొలిచిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 21న రిలీజ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో నటి వేదా జలంధర్ పంచుకున్న ఈ చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే..
నేను అప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టు మా దర్శకుడు రమణకు తెలీదు. ‘అమీర్ లోగ్’ ఆడిషన్‌లో నా పర్‌ఫార్మెన్స్ నచ్చడం వల్లే రమణ నన్ను వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది నా కారెక్టర్. ముక్కుసూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నా. ఈ కారెక్టర్‌లో కూడా ఇలానే ఉంటా. నా వర్క్ అందరికీ నచ్చుతోంది. నేను చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు.
పాత్రకు ప్రాధా న్యం ఉన్న చిత్రాలే చేయాలనుకుంటున్నా. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటున్నా. ‘అమీర్ లోగ్’ సినిమా చూసిన వారంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయనే నంబర్ కంటే.. మనల్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారు.. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నాం అనేదే ముఖ్యం అని నేను భావిస్తా.
అందుకే నా ఈ ఆరేళ్ల జర్నీలో నేను చేసిన పాత్ర లు నాకు సంతృప్తినిచ్చాయి. మనం చేసిన వాటిలో ఎన్ని సినిమాలు విడుదలవుతాయ్ అన్నది మన చేతుల్లో ఉండదు. భాష, యాసతో మా సినిమాకు ఎలాంటి సమస్య రాదు. ఎమోషన్ అనేది అందరికీ కామన్. ఎక్కడైనా ఎమోషన్ అనేది ఒకేలా ఉంటుంది. మా చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అన్ని ప్రాంతాల వారిని మెప్పించేలా ఉంటుంది.






