6 September, 2026 | 8:33 AM

అలా జూమ్ చేస్తే ఒప్పుకోను!

06-09-2026 | 05:35am

కోలీవుడ్ యువ కథానాయకి కయాదు లోహర్ ప్రస్తుతం ‘ఇమ్మోర్టల్’ (Immortal) విజయానందంలో ఉంది. తాను నటించిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఈ మూవీ ప్రమోషన్లలో  (Movie promotions) భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు.. ఇండస్ట్రీలో హీరోయిన్లను చూపించే తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఈ మూవీ ట్రైలర్‌లో కెమెరాను ముఖం నుంచి ప్రారంభించి పెదవుల వైపు జూమ్ చేస్తూ తీసిన విజువల్స్ ఉద్దేశాన్ని మీరు ఎలా చూస్తారు?

అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కయాదు తనదైన శైలిలో స్పందించింది. “ఇండస్ట్రీలో మహిళలను కేవలం వస్తువుగా చూపించడాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను. సినిమాల్లో నటించేటప్పుడు కథకు ఆ సన్నివేశం నిజంగానే అవసరమై, పాత్ర ప్రాధాన్యతను బట్టి సమంజసమని అనిపిస్తేనే ఒక పరిమితి వరకే ఓకే చెప్పవచ్చు. కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే లేదా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవ్వడం కోసమే హీరోయిన్లను అలా జూమ్ చేసి, వివిధ భంగిమల్లో చూపించడాన్ని నేను అస్సలు ఇష్టపడను.

అలాంటి కోణాల్లో తీసే విజువల్స్ నన్ను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయి. వాటికి నేను ఎప్పటికీ అంగీకారం తెలపను. చిత్ర పరిశ్రమలో ఇలాంటి పద్ధతులపై పోరాటం చేయడం చాలా కష్టమైన విషయం. ఈ విషయంలో ఎవరైనా ఒక్కరే గళం విప్పి పోరాడితే, మిగిలిన వారు పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కొట్టిపారేస్తారు.

గతంలో సినిమాల్లో మహిళలను చూపించిన విధానం వల్ల తీవ్ర విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్న ‘పెద్ది’  ఉదాహరణను కూడా కయాదు గుర్తుచేసి అందరినీ ఆలోచనలో పడేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక కయాదు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ది ప్యారడైజ్’, ‘సూర్య-48’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. 

మరిన్ని వార్తలు