ఏడుపాయల్లో ఏరులై పారుతున్న మద్యం..
* గాంధీ జయంతిన విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
* పట్టించుకోని ఆబ్కారి శాఖ అధికారులు
పాపన్నపేట, అక్టోబర్02: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత(Edupayala Vana Durga Mata Temple) చెంత మద్యం ఏరులై పారుతుంది. శుక్రవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిన సైతం మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరిపారు. వన దుర్గమ్మ చెంత సుమారు 40 వరకు దుకాణాలు ఉండగా.. అందులో 30 నుంచి 35 వరకు మద్యం గొలుసు దుకాణాలుగా చలామణి అవుతున్నాయి.
ఈ తతంగమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా వారు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దుకాణంలోనే మద్యంతో పాటు చికెన్ తదితర వంటలు చేసి ఇవ్వడంతో అక్కడే కూర్చుని మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలపై ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
అక్టోబర్ 2న మద్యం దుకాణాలు మూసి ఉండడంతో ఏడుపాయల్లో మద్యం 24 గంటలు దొరుకుతుందని తెలిసి మద్యం ప్రియులు అక్కడికి వెళ్లి విక్రయాలు జరిపారు. బీరు సీసాపై అధనంగా రూ.50 నుంచి రూ.100 వరకు, క్వార్టర్ సీసాపై కూడా ఇదే తరహాలో వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని భక్తులు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం విగ్రహాలపై చర్యలు చేపట్టాలని భక్తులు విన్నవిస్తున్నారు.
మద్యం మత్తులో ప్రాణాల మీదకు..
వనదుర్గమ్మ సన్నిధిలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించిన అనంతరం ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో ఆయా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇకనైనా ఏడుపాయల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు, సందర్శకులు కోరుతున్నారు.
పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటాం. -గోపాల్, డీటీఎఫ్ సీఐ
ఏడుపాయల్లో జోరుగా మద్యం విక్రయాలపై డీటీఎఫ్ సీఐ గోపాల్ ను విజయక్రాంతి వివరణ కోరగా.. పరిశీలించి మద్యం విక్రయాలు జరుపుతున్న దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చెంత మద్యం విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరం. మద్యం విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవు.