నిమజ్జనం.. జాగ్రత్త!
- ఉత్సాహం సరే.. ప్రాణాలతో చెలగాటం వద్దు
- ఐదు రోజుల వినాయకుల నిమజ్జనం పూర్తి
- ఇక ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల గణపతుల నిమజ్జనాలు
- జామ్ని ఘటనతోనైనా అప్రమత్తం కావాలి
- ఈత రాని వారు నీటిలోకి దిగొద్దు
- చిన్నారులు, యువత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం
జైనూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వినాయక చవితి వేడుక(Vinayaka Chavithi Celebration)ల్లో భాగంగా ఐదు రోజుల గణపతుల నిమజ్జనాలు(Ganesha Immersions) మండలవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల వినాయకుల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు, వాగుల(Tanks, ponds, streams) వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది.
దీంతో భక్తులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల జైనూర్ మండలం(Jainoor Mandal) జామ్ని గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ముండే రజనీకాంత్ నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన నిమజ్జనం సమయంలో భద్రతా జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.
లోతు తెలియని నీటిలోకి దిగొద్దు..
చెరువులు, కుంటల్లో నీటి లోతు తెలియకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరం. ఈత వచ్చిన వారు సైతం అత్యుత్సాహంతో లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదు. ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగకుండా ఒడ్డునే ఉండాలి. అధికారులు ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాల్లోనే నిమజ్జనం నిర్వహించాలి.
చిన్నారులపై ప్రత్యేక నిఘా..
నిమజ్జనానికి వచ్చే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నీటి సమీపంలో పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదు. రద్దీ, తోపులాట జరిగే అవకాశం ఉన్నందున వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలి.
మద్యం సేవించి నీటిలోకి వెళ్లొద్దు..
మద్యం సేవించి నిమజ్జనానికి వెళ్లడం, నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరం. మద్యం ప్రభావంతో ప్రమాదాన్ని అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. యువత అత్యుత్సాహానికి పోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
సెల్ఫీలు, వీడియోల కోసం సాహసం వద్దు..
నిమజ్జన దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకోవడం సహజమే. అయితే వాటి కోసం నీటి అంచులకు వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో నిలబడి సెల్ఫీలు తీసు కోవడం చేయకూడదు. ఒక్క ఫొటో కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు.
అధికారుల సూచనలు పాటించాలి..
రానున్న ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల గణపతుల నిమజ్జనాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.వినాయకుడిని భక్తిశ్రద్ధల తో సాగనంపడం ఎంత ముఖ్యమో.. నిమజ్జనం అనంతరం ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడం అంతకంటే ముఖ్యం.