సెమీకండక్టర్ హబ్‌గా భారత్

18-09-2026 | 05:20am
  1. తయారీ పవర్ హౌస్‌గా దేశం
  2. సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రపంచ తయారీకి భారతదేశం ఒక విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. దేశాన్ని ప్రాధాన్య సెమీకండక్టర్ హబ్‌గా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం అవసరమైన ప్రతి అడుగు వేస్తోందని తెలిపారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా  ఎడిషన్ ప్రారంభించారు. ఇందులో దేశీయ సెమీకండక్టర్ రంగ అభివృద్ధిపై ప్రధాన మంత్రి సమీక్షించి, ప్రముఖ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘ప్రపంచం కొత్త, విశ్వసనీయ తయారీ గమ్యస్థానాల కోసం చూస్తోంది. ఈ అవసరాన్ని తీర్చడానికి భారతదేశం స్థిరంగా సిద్ధమవుతోంది’ అని అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారడానికి భారతదేశం అవసరమైన ప్రతి అడుగు వేస్తోందని స్పష్టం చేశారు. భారత్‌లో తయారైన చిప్‌లు తొలిసారిగా దేశవిదేశాల్లో వినియోగదారులకు చేరుతున్నాయని తెలిపారు. మొహాలీ, సూరత్‌లోని కొత్త ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తి మొదలైందని ఆయన తెలిపారు.

భారత్‌లో మూడు వేల కిలోమీటర్ల సరుకు రవాణా కారిడార్లు కార్యరూపం దాల్చున్నాయని చెప్పారు. త్రైమాసిక జీడీపీలో భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందని మోదీ పేర్కొన్నారు. ఇటీవల భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఉదహరించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. మరోవైపు భారతదేశంపై ప్రపంచ విశ్వాసం కూడా పెరుగుతోంది అని తెలిపారు. 2022లో ఈ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎకోసిస్టమ్ వేగంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించినందుకు, ఈ సదస్సుకు హాజరైన పారిశ్రామిక నాయకులను ఆయన ప్రశంసించారు.

‘భారతదేశం సాధించిన ఈ విజయానికి మీరే మూలస్తంభాలు, మీరే మా భాగస్వాములు’ అని మోదీ అన్నారు. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చిప్ డిజైన్, పరికరాలు, మెటీరియల్స్, టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటి సామర్థ్యాలు అవసరమని ప్రధానమంత్రి అన్నారు.

దేశీయ పరిశోధన, అభివృద్ధిని మరింతగా పెంపొందించాలని ఆయన పరిశ్రమల అధిపతులను కోరారు. అలాగే, విదేశాలలో పనిచేస్తున్న భారతీయ పరిశోధకులు దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి తోడ్పడాలని ప్రోత్సహించారు. మరిన్ని ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ కంపెనీలతో సహా, దేశీయ సరఫరా గొలుసును మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ కోరారు. 

మరిన్ని వార్తలు