గురి అదిరింది

03-10-2026 | 05:15am
  1. ఆర్చరీలో భారత్ జోరు
  2. మహిళల రికర్వ్ టీం ఈవెంట్‌లో స్వర్ణం
  3. పురుషుల రికర్వ్ టీంకు రజతం
  4. మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లోనూ రజతం

నగోయా, అక్టోబర్ 2 : ఆసియా క్రీడల(Asian Games) ఆర్చరీలో(Archery) భారత్ జోరు కొనసాగుతోంది. వరుస పతకాలతో మన విలువిద్య సత్తా మరోసారి రుజువైంది. తాజాగా మహిళల రికర్వ్ టీమ్(Women's Recurve Team) విభాగంలో అంకిత భకత్(Ankit Bhakat), కీర్తి శర్మ, కుమ్కుమ్ మోహోద్లతో కూడిన భారత త్రయం చరిత్రలో తొలిసారి ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.ఫైనల్ పోరులో భారత జట్టు 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన బలమైన దక్షిణ కొరియాను 5--3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.గత 7 ఆసియా క్రీడలుగా ఈ విభాగంలో కొరియా కొనసాగిస్తున్న ఆధిపత్యానికి భారత అమ్మాయిలు బ్రేక్ వేశారు.

తొలి రెండు సెట్లు డ్రా కావడంతో పోటీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తర్వాత రెండు సెట్లలో భారత ఆర్చర్లు ఏమాత్రం తడబడకుండా లీడ్ సాధించారు. మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్, యశ్దీప్, నీరజ్లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 6- ఇరాన్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో భారత్ 1-5 తేడాతో కొరియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

మొదటి సెట్లో ఉత్కంఠభరితంగా 56-56 పాయింట్లతో స్కోరు సమం అయినప్పటికీ, తర్వాతి సెట్లలో కొరియా ఆర్చర్లు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఆసియా క్రీడల పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు వరుసగా రెండోసారి రజత పతకం లభించినట్లయింది. ఇదిలా ఉంటే మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, కుమ్‌కుమ్ మోహోద్ జోడీ రజత పతకం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జోడీ 3--5 తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. ఆసియా క్రీడల చరిత్రలో రికర్వ్ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం. అయితే, ఈ ఓటమితో లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ కోటాను భారత్ తృటిలో కోల్పోయింది.

మరిన్ని వార్తలు