పంట పొలాలను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు
నిజామాబాద్, అక్టోబర్ 02 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) నాయకులు పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. సాగు నీరు లేక రైతులు వరి పంటకు నిప్పు పెట్టి కాల్చి వేసుకున్న విషయాన్ని తెలుసుకొని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పరిశీలించారు. ఈ సందర్భంగా తెరస జిల్లా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ
ఎత్తిపోతల పంపులు చెడిపోతే బాగు చేయకుండా పంటలు ఎండిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పండిస్తున్న 1600 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయాడు. మోటార్లు చెడిపోయి 20 రోజుల గడుస్తున్నా బాగి చేయించడం లేదని మండిపడ్డాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వాపోయాడు. లింగాపూర్ గ్రామానికి చెందిన గణేష్ అనే రైతు బాధతో వరి పంటకు నిప్పు పెట్టుకోవడం బాధాకర విషయమన్నారు.
చేతికి వచ్చిన పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వాపోయాడు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి మోటార్లను బాగు చేయించి ఆదుకోవాలని కోరారు. నష్ట పోయిన పంటకు వెంటనే నష్ట పరిహారం అందించాలని, లేని యెడల నష్ట పోయిన రైతులతో ఏమ్మెల్యే ఇంటిని, జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, యెండల ప్రసాద్ జిల్లా నాయకులు కరిపే గంగాధర్, షాన్వాజ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.