కాశీ తర్వాత తెలంగాణలోనే..

04-10-2026 | 05:20am

మహిమగల్ల దేవుడు.. ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడు

కాశీలో కనిపించే కాలభైరవుడి ఆలయం.. దక్షిణాదిలో ఎక్కడుందంటే? అది కేవలం మన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉంది. ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో కాలభైరవుడు కొలువై ఉన్నాడు. ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు, ఏటా నవంబర్‌లో 10 రోజుల పాటు చక్కెర తీర్థం జరుగుతుంది.  

ఎక్కడ ఉన్నది?: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి. 

ఎలా వెళ్లాలి?: కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి వాహనాలు వెళ్తాయి. మాచారెడ్డి, సదాశివనగర్, భీమ్‌గల్ నుంచి రామారెడ్డికి బస్సు సౌకర్యముంది. రామారెడ్డి బస్టాప్(Ramareddy Bus Stop) నుంచి 750 మీటర్ల దూరంలోనే ఆలయం ఉంది. కామారెడ్డి నుంచి కాలభైరవ ఆలయానికి 9 కిలోమీటర్లు మాత్రమే.

ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు: సుమారు 1760 సంవత్సరంలో దోమకొండను పాలించిన రాజుల్లో రామిరెడ్డి, కామిరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారికి కాలభైరవుడు కలలో కనిపించి.. కాశీ క్షేత్రంలో ఉన్న తన ప్రతిమను తీసుకురావాలని, విగ్రహం ఎక్కడ పడిపోతే అక్కడే ప్రతిష్టించాలని చెప్పాడట. ఆ మేరకు కాశీ నుంచి ప్రతిమను ఎడ్ల బండ్లపై తెస్తుండగా.. ఇసన్నపల్లి వద్ద భారీ వర్షం పడి, ఆ బండ్లు ఆగిపోయి, విగ్రహం భూమిలోకి దిగిపోయిందట.

అట్ల ఇసన్నపల్లిలో కాలభైరవుడు కొలువయ్యాడని స్థానికులు చెప్తుంటారు. ఇసన్నపల్లి గ్రామానికి అష్ట దిక్కుల్లో అష్ట భైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ తమకు రక్షకులుగా ఉంటారని స్థానికుల నమ్మకం. అష్ట భైరవుల్లో కాల భైరవస్వామి ఆలయం తప్ప మిగతా ఏడు ఆలయాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కాలభైరవ ఆలయ గర్భగుడి ద్వారం పడమటి వైపు, స్వామివారి ముఖం దక్షిణం వైపు ఉన్నాయి. మహిమగల్ల దేవుడు.. కాలభైరవుడని, కొలిచినవారికి కొంగుబంగారమని భక్తులు విశ్వసిస్తుంటారు.  

మూలబావి: ఆలయం వెనుకాల ఈశాన్యంలో మూలబావి ఉంది. ఇందులో సంవత్సరం పొడుగునా నీళ్లు ఉంటాయి. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ బావి పక్కనే కోనేరు ఉంటుంది. ప్రస్తుతం ఆ కోనేరులో స్నానం చేయడానికి అనుమతి లేదు.

నవంబర్‌లో 10రోజుల జాతర

ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నవంబర్‌లో వేడుకలు నిర్వహిస్తారు. ఎడ్లబండ్ల ప్రదర్శన, అగ్ని గుండాలు, ఒగ్గు కథలు, చక్కెర తీర్థం వంటి కార్యక్రమాలతో 10 రోజులు జాతర జరుగుతుంది. ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయానికి సమీపంలోనే రామారెడ్డిలో వేంకటేశ్వరాస్వామి ఆలయం, ఉమా మహేశ్వర స్వామి ఆలయం, రామాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, పలు ప్రాచీన ఆలయాలు, కట్ట డాలు ఉన్నాయి.

శ్రీరామనవమి రోజున ఒకేసారి రెండు రథాలను ఊరేగిస్తారు. మొదటి రథంపై సీతారాములను, రెండో రథంపై  శివపార్వతులను ఊరేగిస్తారు. ఇలా ఏక కాలంలో రెండు రథాలు ఊరేగడం చాలా అరుదు. అందుకే ఈ ప్రాంతాన్ని రథాల రామారెడ్డి అని కూడా పిలుస్తారు. 

ప్రశాంత వాతావరణం

ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి, వ్యవసాయ పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నగర జీవనంలోని హడావుడికి దూరంగా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు అనువైన క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. పైగా, కాలభైరవ స్వామి ఆలయంతో పాటు సమీపంలోని దోమకొండ కోట, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉమామహేశ్వరస్వామి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆలయం వంటి పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉండటంతో భక్తులు ఏకకాలంలో వీటన్నింటిని సందర్శిస్తున్నారు.  

అత్యంత విశిష్ట క్షేత్రం: ఈవో

ఇసన్నపల్లిలోని కాలభైరవస్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటని ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ప్రభు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు.

ఆలయన ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ..  ఆలయం వెనుక ఉన్న మూలబావి తీర్థానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని, ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు, సంతానలేమి, కుటుంబ సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసమన్నారు. రోజూ పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 

                       బి. సుధీర్ కుమార్‌గౌడ్, 


మరిన్ని వార్తలు