కో-పైలెట్‌కు అల్‌ఖైదాతో లింకులు?
- నిందితుడి సోషల్ మీడియాలో లాడెన్, -జవాహిరి ఫొటోలు
- ఒమన్ పౌరుడిగా.. పేరు హమామ్ అల్-హమ్మామీగా గుర్తింపు
- అతడిపై ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధం
న్యూయార్క్, అక్టోబర్ 3: దుబాయ్టెల్ అవీవ్ విమానంలో(Dubai-Tel Aviv flight) భారత కెప్టెన్‌పై దాడి చేసిన కో-పైలెట్ హమామ్ అల్-హమ్మామీపై దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోపైలెట్‌కు అల్‌ఖైదాతో లింకులు ఉన్నట్లు దర్యాప్తులో తేలిసింది. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు పరిశీలించగా, అతడు తీవ్రమైన జిహాదీ, ఉగ్రవాద భావజాలానికి లోనైనట్లు స్పష్టమైందని పేర్కొన్నారు.
అతని సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ విమానాల వీడియోలతో పాటు ఒసామా బిన్ లాడెన్, ఐమన్ అల్-జవాహిరి వంటి ఉగ్రవాదుల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసినట్లు గుర్తించారు. అలాగే కోపైలెట్ హమామ్ అల్-హమ్మామిగా, అతనిని ఒమన్ పౌరుడిగా అధికారులు శనివారం గుర్తించారు. కోపైలెట్ అల్-హమ్మామి తీవ్రవాద నేపథ్యం కారణంగా గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా అతడిపై నిషేధం విధించినట్లు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఈ కేసు ఈ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్న యూఏఈ, తమ విచారణలో కో-పైలెట్ ఉగ్రవాద చర్యకు ప్రయత్నించినట్లు వెల్లడైందని తెలిపింది. అతను ఒమన్ తండ్రికి, సిరియా తల్లికి యూఏఈలో జన్మించాడని, తన జీవితంలో చాలా సంవత్సరాలు యూఏఈలోనే గడిపాడని పేర్కొంది.
ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థలో అతను సుమారు ఎనిమిది నెలల నుంచి పనిచేస్తున్నట్లు సమాచారం. ఉగ్రకుట్రలో భాగంగానే ఫ్లైట్ డెక్‌లో కో-పైలెట్ క్రాష్ యాక్సెస్‌తో కెప్టెన్‌పై దాడి చేసి, విమానం నియంత్రణను తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడని యూఏ ఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ తెలిపారు.