మేడిపల్లి క్యారెట్‌లేన్‌ నగల దుకాణంలో భారీ చోరీ!

05-10-2026 | 07:57pm

సుమారు రూ 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు అపహరణ

మేడిపల్లి,(విజయక్రాంతి):  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా(Medchal-Malkajgiri District) మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ(Peerzadiguda) ‘క్యారెట్‌లేన్’ (టాటా ప్రొడక్ట్) గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌(Carrotlane Gold and Diamonds showroom)లో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి కెనరా నగర్ బస్టాప్ సమీపంలో ఉన్న ఈ దుకాణంలోకి సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఏడుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. ముందుగా దుకాణం ఎదుట పరదా చాటుగా పెట్టి, ఐరన్ రాడ్లతో షట్టర్ లాక్‌లను పగలగొట్టారు.

అనంతరం షట్టర్ పైకి లేపి, లోపల ఉన్న గ్లాస్ డోర్లను పగలగొట్టి భారీగా బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం వాచ్‌మెన్ వచ్చి చూడగా షట్టర్ లాక్ తెరిచి ఉండటం, షాపు ప్రాంగణంలో అక్కడక్కడా కొన్ని బంగారు ఉంగరాలు పడి ఉండటంతో వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే  క్లూస్ టీమ్స్‌‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్, సీఐ జలేందర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ... ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయని వెల్లడించారు. ఈ దొంగతనానికి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్నామని తెలిపారు.నిందితులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేగవంతంగా దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు