జర్నలిస్టుల రక్షణకు కదం తొక్కిన కలం వీరులు
నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి ): జర్నలిస్టులపై దాడులు, అవమానాలను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం పటిష్టం చేయాలని డియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు(IJU State Leaders) వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.విజయ కుమార్, సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఐజేయు జర్నలిస్టు సంఘం తెలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ కూడలి నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరారు.
అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాపాడడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, కుటుంబ భద్రత కొరకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు.
సంక్షేమ పథకాలు అమలు ఆయా శాఖలోని అవినీతి అక్రమాలను వెలికి తీసే క్రమంలో దాడులు అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. కనీస వసతులు సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. హెల్త్ కార్డులతోపాటు అక్రిడేషన్ కార్డులు, బస్సు పాసులను కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక మీడియా కమిషన్, రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.