31 August, 2026 | 1:15 AM

ఒక్కసారి కలిసిపో!

31-08-2026 12:00 AM

మిన్నువిరిగి మీద పడ్డట్టు

అలా దాక్కుంటావేం?

బతుకుపై భయమెందుకు?

ఇవ్వాళుంటాం.. రేపు పోతాం !!

నీటి బుడగ జీవితానికి

ఇన్ని భేషజాలెందుకు?

బేఫికర్‌గా బతికే కొన్నిరోజులు చాలదా !

కొన్ని మాటల్ని ఇచ్చి పుచ్చుకోవాలి 

ముఖాముఖిగా భావాల్ని పంచుకోవాలి 

కొన్ని నవ్వుల్ని కళ్లారా చూసి

కొన్ని పువ్వుల్ని దాచుకు పోవాలి

కలవటం మరువకు

ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టు

చరవాణిలో మాట్లాడకు

సాయంకాలం అలా సెంటర్‌కు రా !

ఛాయ్ తాగుతూ.. మాట్లాడుకుందాం..

సమస్యలన్నీ కట్టకట్టి ఇంట్లోపెట్టిరా.. 

ఓయ్.. నిన్నే ఒక్కసారి కలిసిపో !!

 డా.రమేష్ కటుకోఝ్యల