అమరవీరులకు సెల్యూట్.. సైకిల్, బైక్ ర్యాలీ!
బోధన్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Flag Day) సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8 గంటలకు పూలాంగ్ చౌరస్తా వద్ద అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
పూలాంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రగతి ఆసుపత్రి, ఎల్ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగింది. ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు పోలీసులు ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం అనేకమంది పోలీసులు ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని వివరించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వారి సేవలు పోలీస్ శాఖకు, సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
పోలీసులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని, వారు ధరించే యూనిఫాం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. ప్రజల రక్షణ, న్యాయం, దేశసేవ కోసం పక్షపాతం లేకుండా అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.