కాళేశ్వరం పనులు ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలి

22-09-2026 | 10:00pm
  1. ఆలయ పునర్నిర్మాణం, పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలి
  2. నాణ్యతలో రాజీ వద్దు.. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
  3. స్వామివారికి ప్రత్యేక పూజలు అభివృద్ధి పనుల పరిశీలన

భూపాలపల్లి/ కాళేశ్వరం, సెప్టెంబర్‌ 22 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ(Sri Kaleshwara Muktheeswara Swamy Temple) పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridharbabu)అధికారులను ఆదేశించారు. మంగళవారం కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్టీసీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. దేవుడి నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఆదేశించారు.

పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణ, ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి

పనుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్‌ అధికారులు కాళేశ్వరంలోనే ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. పనుల పురోగతిని కాటారం సబ్‌ కలెక్టర్‌ గౌరవ్‌ శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సమన్వయం చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.

సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్‌ కలెక్టర్ గౌరవ్‌ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్‌ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, దేవస్థానం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణమూర్తి, సర్పంచ్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు

కాళేశ్వరం విచ్చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ

ధార్మిక సలహాదారు గోవిందహరి ఆలయ అర్చకులు, అధికారులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ ఆదిముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించగా, మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

మరిన్ని వార్తలు