కల్లూరు ఎస్జీఎఫ్‌ పోటీలు ఘనంగా ముగింపు

22-09-2026 | 11:46pm

ఓవరాల్‌ ఛాంపియన్‌గా పీఎం శ్రీ హైస్కూల్‌

కల్లూరు, సెప్టెంబర్‌ 22 (విజయక్రాంతి): కల్లూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహించిన మండల స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(Mandal-level School Games Federation) క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 1,034 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు.

అత్యధిక విభాగాల్లో విజయాలు సాధించిన పీఎం శ్రీ హైస్కూల్‌ కల్లూరు ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.వాలీబాల్‌ అండర్‌-14 బాలురలో విజ్ఞాన్‌ స్కూల్‌, బాలికల్లో పీఎం శ్రీ హైస్కూల్‌, అండర్‌-17 బాలురలో పీఎం శ్రీ హైస్కూల్‌, బాలికల్లో ఏజీహెచ్‌ఎస్‌ విజేతలుగా నిలిచాయి.

ఖో-ఖోలో అండర్‌-14 బాలురలో చెన్నూరు జెడ్పీహెచ్‌ఎస్‌, బాలికల్లో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, అండర్‌-17 బాలురలో ప్రతిభ హైస్కూల్‌, బాలికల్లో టీజీడబ్ల్యూఆర్‌ఏఎస్‌ విజయం సాధించాయి. కబడ్డీలో అండర్‌-14 బాలురలో తెలంగాణ గ్లామర్‌ స్కూల్‌, అండర్‌-17 బాలురలో చిన్నకోరుకొండి జెడ్పీహెచ్‌ఎస్‌, బాలికల్లో పేరువంచ జెడ్పీహెచ్‌ఎస్‌ విజేతలుగా నిలిచాయి.క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ మెంబర్‌ పెండకంటి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతులు కల్పించారు.

ఖమ్మం జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు నిర్వాహకులు విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పెనుబల్లి, కల్లూరు మండలాలకు చెందిన 25 మంది పీఈటీలు, పీడీల సమన్వయంతో పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఇదే వేదికపై సెప్టెంబర్‌ 23న అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు