జీఎం కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్(Singareni Srirampur) ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలను బుధ వారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి జీఎం మునిగంటి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తెలంగాణ సాధనకు సరళమైన భాషలో తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం రగిల్చేలా తన రచనలతో జీవితాంతం కృషిచేసిన మహనీయులు కాళోజి అని కొనియాడారు.
ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక చైతన్య వేత్త, ప్రజల కష్టాలను తన కష్టంగా భావించిన ప్రజాకవి అని స్పష్టంచేశారు. కాళోజీ నారాయణ రావు సేవలకు గుర్తింపుగా దేశ రెండవ అత్యున్నత పౌర పురష్కారమైన పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించిందన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎం (ఎక్స్ ఫ్లొరేషన్) పంకజ్, ఎస్ఓటూ జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, ఏరియా పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఏరియా సర్వేయర్ నర్సింగరావు, పిట్ సెక్రటరీ సందీప్, సీఎంఓఏఐ ప్రతినిధి పద్మ, ఇతర అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.