మేడిపూర్ చెరువుకు కేఎల్ఐ నీరు.!
భూసేకరణపై కలెక్టర్ పరిశీలన
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మేడిపూర్ చెరువుకు కేఎల్ఐ(KLI) నీటిని తరలించే విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(Collector Hemanta Keshav Patil) అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడూరు మండలం మేడిపూర్ శివారులో కేఎల్ఐ 28వ ప్యాకేజీ నుంచి చెరువుకు నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూసేకరణ, కాలువ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ భూములకు నష్టం కలగకుండా కాలువకు బదులుగా పైపులైన్ ద్వారా నీటిని తరలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు.
చెరువు పరిసరాల్లో అనుమతులు లేకుండా మట్టిని చదును చేసిన ప్రాంతాన్ని గుర్తించిన కలెక్టర్, వెంటనే తొలగించాలని ఆదేశించారు. చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వెంట కేఎల్ఐ భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణ రెడ్డి, డీపీవో శ్రీరాములు, తహసీల్దార్, సర్పంచ్ మల్లేష్, రైతులు, అధికారులు ఉన్నారు.