దళితుల హక్కుల సాధనకు పోరాటాలు కొనసాగిస్తాం సంతోష్

02-10-2026 | 08:50pm

మోర్గిలో కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ

నాగల్‌గిద్ద, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్)(Kulavivaksha Vyatireka Porata Sangham) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన కేవీపీఎస్ జెండాను సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళితుల సమస్యల పరిష్కారం, ఆత్మగౌరవం, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన లక్ష్యాలతో కేవీపీఎస్ ఏర్పాటైందన్నారు.

అప్పటి నుంచి అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతూ దళితుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం, దళితులకు శ్మశానవాటికల ఏర్పాటు తదితర అంశాలపై కేవీపీఎస్ పోరాటాలు నిర్వహించిందన్నారు.

జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, దళితులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంతోష్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం దళితులు, బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. గణపతి, జంబల్, దూలప్ప, హుస్సేన్, అనిల్, తరుణ్, భారత్, మహేష్, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు