లష్కర్ కమాండర్ మూసా హతం

01-10-2026 | 05:00am

ముషార్రఫ్‌కు భద్రతలో పనిచేశాడన్న నిఘావర్గాలు

గుల్మార్గ్, పూంచ్ దాడుల్లో హస్తం

బుద్గాం కోరాగ్‌లో ఎన్‌కౌంటర్

శ్రీనగర్, సెప్టెంబర్ 30: జమ్మూకశ్మీర్ బుద్గాంలో మంగళవారం అర్ధరాత్రి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో లష్కర్ చెందిన అగ్రశ్రేణి కమాండర్ హషీమ్ మూసా(Lashkar-e-Taiba Top Commander Hashim Moosa)ను మట్టుబెట్టారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా బుద్గాంలోని యూస్‌మార్గ్ కోరాగ్ ప్రాంతంలో జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా అవతలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హషీమ్ మూసా హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఎవరి హషీమ్ మూసా?..

పాక్‌కు చెందిన ఇతను సైనిక విభాగంలో పనిచేసి, అటు పిమ్మట పలు దేశాల్లో ఉన్నతస్థాయి శిక్షణ పొందాడు. పాక్ ప్రభుత్వంలోని వీవీఐపీల భద్రతా విధులను కూడా నిర్వర్తించాడు. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భద్రతలో కూడా మూసా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ కేంద్రంగా భారత్‌లో పలు ఉగ్రవాద దాడుల్లో ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు వివరించారు.

2023లో లష్కర్‌ఏ చేరి జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) బాధ్యతలను చేపట్టినట్లుగా పేర్కొన్నారు. పహెల్గాం దాడిలో కూడా ఇతడి హస్తం ఉందని భావించినప్పటికీ తదుపరి దర్యాప్తులో ఇతని హస్తం లేదని గుర్తించారు. ఇతడి వద్ద పాక్‌కు చెందిన ఐడీని, పలు ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2024 గుల్మార్గ్ దాడి, 2024 పూంచ్ దాడి సహా ఇతర దాడుల్లో ఇతడి ప్రమేయం ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు