6 September, 2026 | 8:22 AM

ఎల్‌ఈటీ కమాండర్ హతం

06-09-2026 | 05:25am
  1. జమ్మూకశ్మీర్ బుద్గామ్‌లో మట్టుబెట్టిన భద్రతాదళాలు
  2. ఏకే 47 స్వాధీనం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

శ్రీనగర్, సెప్టెంబర్ 5: పూంచ్ భారత వైమానిక దళ దాడిలో పాల్గొన్న, లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ (Lashkar-e-Taiba commander Yasir) హతమయ్యాడు. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో అతన్ని మట్టుబెట్టామని ఆర్మీ ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు. బుద్గామ్‌లోని యూస్మార్గ్‌లోని అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. శుక్రవారం యూస్మార్గ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదిని గుర్తించాయి.

భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాది వారిపై కాల్పులకు తెగబడడంతో ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడు. ఒక ఏకే 47 రైఫిల్, పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మరిన్ని ఉగ్ర కదలికలు ఉండే అవకాశం ఉండడంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఎల్‌ఇటీకి చెందిన యాసిర్ ఏడాది క్రితం నుంచి స్వతంత్రంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

పహెల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులతో ఇతనికి సంబంధాలున్నాయని చెప్పారు. వారితోపాటు యాసిర్ ఫోటో కూడా ఉండటం గమనార్హం. దీంతో భద్రతా బలగాలు ఇతని కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు ఇప్పుడు చిక్కి హతమయ్యాడు. కాగా ఇతని కోసం వారంరోజులుగా ఇంటలిజెన్స్ ఓ కంటకని పెట్టి భద్రతా దళాలకు పక్కా సమాచారం ఇచ్చింది. కాగా రెండు నెలల తరువాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి ఎన్ కౌంటర్ ఇదే. జూలై 9న షోపియాన్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు అగ్రశ్రేణి ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. 


మరిన్ని వార్తలు