అగ్నిప్రమాదంలో లింగాల కేదారి దంపతుల మృతి
హనుమకొండ, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని(Hanumakonda Adalat Junction) లింగాల కేదారి హోటల్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఓరుగల్లు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. హోటల్ యజమాని లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అదాలత్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కాజీపేట ట్రాఫిక్(Kazipet Traffic) కానిస్టేబుల్ గణేష్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు చేరుకొని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా కేదారి మృతి చెందారు. ఆయన భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనతో ఓరుగల్లు ప్రజలకు కేవలం ఓ హోటల్ యజమాని మృతి చెందిన విషాదమే కాదు, ఎన్నో ఏళ్లుగా ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టిన ఓ ఆపన్నహస్తం దూరమైన బాధ మిగిలింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం(Telangana Movement) ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో అదాలత్ సెంటర్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చే విద్యార్థులు, ఉద్యమకారులకు లింగాల కేదారి దంపతులు తమ హోటల్ ద్వారా ఉచితంగా టీ, టిఫిన్, భోజనాలు అందించేవారు. ఉద్యమకారుల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి ఆహారం అందించడాన్ని సేవగా భావించారు. లాభార్జన కంటే మానవీయతకే పెద్దపీట వేస్తూ హోటల్‌ను నిర్వహించారు. ఉద్యమ సమయంలో కేదారి అందించిన సేవలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉద్యమకారులకు ఆహారం అందించిన ఆయన అనంతరం కూడా అదే సేవా దృక్పథాన్ని కొనసాగించారు. భార్యాభర్తలిద్దరూ హోటల్ లో స్వయంగా పనిచేస్తూ సామాజిక సేవకు తమ జీవితాలను అంకితం చేశారు.
ఆహారాన్ని వృథా చేయొద్దనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లోనూ కేదారి ప్రత్యేకంగా కృషి చేశారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంత ముఖ్యమో, అందుబాటులో ఉన్న ఆహారాన్ని వృథా చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పించారు. ‘ఫుడ్ వేస్ట్ చేయొద్దు’(Don't waste food) అనే నినాదాన్ని వరంగల్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. హోటల్‌ను కేవలం వ్యాపార కేంద్రంగా కాకుండా, నలుగురికి ఉపయోగపడే వేదికగా తీర్చిదిద్దారు. ఆకలితో వచ్చిన వారికి ఆహారం పెట్టడం, అవసరమైన వారికి చేయూతనివ్వడం ద్వారా కేదారి దంపతులు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే వారి హోటల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కేదారిని ఓ హోటల్ యజమానిగా కాకుండా సేవామూర్తిగా గుర్తు చేసుకుంటున్నారు.
కేదారి సేవా కార్యక్రమాలకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా సుమారు రెండేళ్ల క్రితం కేదారితో మాట్లాడారు. సాధారణ హోటల్‌ను నిర్వహిస్తూ సామాజిక సేవకు ప్రాధాన్యం ఇచ్చిన కేదారి ప్రధానమంత్రితో మాట్లాడే స్థాయిలో గుర్తింపు పొందడం ఆయన సేవా ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచింది. ఎంతోమంది ఆకలి తీర్చిన చేతులు చివరకు అగ్ని ప్రమాదంలో ఆగిపోవడం కేదారి సేవలను గుర్తు చేసుకుంటున్న వారిని కలచివేస్తోంది. కేదారి దంపతుల మృతి పట్ల ఓరుగల్లు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తన జీవితాన్ని సంపాదన కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా మలుచుకున్న కేదారి భౌతికంగా దూరమైనా, ఆయన చేసిన సేవలు మాత్రం హనుమకొండ ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.