బీసీల ఆత్మగౌరవం.. అధికారంలో వాటా

01-10-2026 | 05:10am

2028లో తెలంగాణ పీఠంపై బీసీ సీఎం

టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikar Party) అధినేత తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 14వ రోజు బుధవారం నారాయణపేట జిల్లా ధన్వాడకు చేరుకుంది. నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మదివాల కృష్ణ ఆధ్వర్యంలో ధన్వాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు.

సమాజంలో మెజారిటీగా ఉన్న బీసీ, బహుజన వర్గాలు అందరితో సమానంగా గౌరవం, హోదా పొందడమే నిజమైన ఆత్మగౌరవమని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం 2,35,000 ఓట్లు ఉండగా, అందులో 1,65,000 ఓట్లు (67%) బీసీలవేనని, రెడ్ల ఓట్లు కేవలం 10,000 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 67 శాతం ఓట్ల బలం ఉన్న బీసీలు ఆత్మగౌరవంతో బతకాలని పిలుపునిచ్చారు. బీసీల చేతిలో అధికారం ఉంటేనే సమాజంలో గౌరవం, భద్రత లభిస్తాయని స్పష్టం చేశారు.

2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ బిడ్డయే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడని, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల గుర్తు ‘కత్తెర’ అని వెల్లడిస్తూ, ఈ కత్తెర గుర్తుతోనే బీసీల బతుకులు మారుతాయని, రెడ్డి, వెలమల రాజకీయాలకు చరమగీతం పాడుతామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, జిల్లా యువత అధ్యక్షులు కొమ్మూరు రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు